weather: దక్షిణ తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయే అవకాశముంది. ప్రస్తుతం ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
రాబోయే కొన్ని గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అంచనా. హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి రంగారెడ్డి, వరంగల్, నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో వర్ష సూచనలున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వాతావరణం మేఘావృతమై ఉండగా, అక్కడక్కడా చిరుజల్లులు కూడా ప్రారంభమయ్యాయి.
వర్షాలతో పాటు ఈదురుగాలులు కూడా దాటవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. గాలులు సుమారు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొంది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. రైతులు, ప్రయాణికులు, నగరప్రాంతాల్లో నివసించే వారు వాతావరణ మార్పులపై దృష్టి పెట్టాలని వాతావరణ శాఖ సూచించింది.

