Raashi Khanna: సరిగ్గా పదేళ్ళ క్రితం ‘మనం’ సినిమాలో చటుక్కున మెరిసిన రాశీఖన్నా… అదే యేడాది ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. అంతేకాదు… ఆ తర్వాత ‘జోరు’తో జోరు పెంచింది. ఆపైన వచ్చిన ‘జిల్’మూవీ ఆమెకు మరో విజయాన్ని అందించింది. అలా ‘బెంగాల్ టైగర్, సుప్రీమ్’ సినిమాతో మరో రెండు విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ఆశించిన స్థాయి విజయాలను అందుకోలేకపోయినా రాశీఖన్నా ‘తొలి ప్రేమ’తో మరో సక్సెస్ సాధించింది. ఆ తర్వాత వచ్చిన ‘వెంకీ మామ’, ‘ప్రతి రోజు పండగే’తో తెలుగువారికి మరింత చేరువైంది. అయితే… గత కొంతకాలంగా ఆమెకు సక్సెస్ లే కాదు… తెలుగులో సరైన అవకాశాలూ దక్కడం లేదు. అయినా నిరాశ పడకుండా ముందుకు సాగుతోంద. ఈ యేడాది తమిళంలో చేసిన ‘అరణ్మనై -4’ చక్కని విజయాన్ని అందుకుంది. హిందీలో చేసిన ‘యోథ’ ఫర్వాలేదనిపించినా, ‘సబర్మతి ఎక్స్ ప్రెస్’ విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ప్రస్తుతం తెలుగులో రాశీ ఖన్నా ‘తెలుసుకదా’ మూవీలో నటిస్తోంది. నవంబర్ 30వ తేదీతో 35వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న… రాశీఖన్నా… రాశిపరంగా కాకపోయినా వాసి కల పాత్రలు పోషించాలని కోరుకుందాం.