Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డ్రగ్స్ వినియోగంపై అవగాహన పెంచేందుకు ఒక ప్రత్యేక వీడియో విడుదల చేశారు. మంగళవారం ఆయన తన సోషల్ మీడియా వేదికగా ఈ వీడియోను పంచుకున్నారు. ఇందులో, డ్రగ్స్ వలన జరిగే అనర్థాలను స్పష్టంగా వివరించారు.
“మన జీవితంలో ఆనందాలు అనేకం ఉన్నాయి. కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ మనకు అందుబాటులో ఉంది. మనల్ని ప్రేమించే వారు, మన కోసం బతికే వారు మన చుట్టూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో, మన జీవితాన్ని నాశనం చేసే డ్రగ్స్ మనకు అవసరమా? డార్లింగ్స్, ఇక నుంచి డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు నో చెప్పండి. ఎవరైనా డ్రగ్స్‌కు బానిసలైతే, 8712671111 నెంబర్‌కు కాల్ చేసి సమాచారం ఇవ్వండి. డ్రగ్స్ బాధితులను తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా అండగా నిలుస్తుంది. బాధితులు త్వరగా కోలుకునేలా అవసరమైన చర్యలు తీసుకుంటుంది,” అని ప్రభాస్ తన సందేశంలో చెప్పారు.
న్యూఇయర్ వేడుకలపై పోలీసులు కఠిన చర్యలు
ఇదిలా ఉంటే, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తెలంగాణ పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పబ్‌లు, బార్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, ఓనర్లకు హెచ్చరికలు జారీ చేశారు. డ్రగ్స్ వినియోగంపై తమకు సమాచారం అందితే కఠిన చర్యలు తప్పవని వారు స్పష్టం చేశారు.
“వేడుకలను ఉత్సాహంగా, కానీ ఇతరులకు ఇబ్బంది కలగకుండా జరుపుకోండి. చట్టాలను పాటించండి. డ్రగ్స్ వాడకంపై మీ దృష్టికి వస్తే బాధ్యతగల పౌరులుగా తక్షణమే సమాచారం అందించండి,” అని పోలీసులు సూచించారు.
డ్రగ్స్‌తో సంబంధం లేకుండా, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని ప్రభాస్, తెలంగాణ పోలీసులు చేస్తున్న ఈ ప్రయత్నం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.