Ponguleti srinivas: తెలంగాణ ప్రజలకు మరో శుభవార్త అందింది. రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను అందజేస్తామని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– రాష్ట్రంలో మొదటి విడతలో 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేస్తున్నామని, ఇప్పటివరకు 2.50 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని వివరించారు. ఇంకా ఇల్లు పొందని అర్హులూ మిగిలి ఉన్నారని, వారు బాధపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. త్వరలోనే మిగిలిన లబ్ధిదారులకు విడతలవారీగా ఇళ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తూ, “బీఆర్ఎస్ చెప్పిన కట్టుకథలు నమ్మి గతంలో ప్రజలు మోసపోయారు. 10 సంవత్సరాలు వాళ్ల మాటలు నమ్మడం వల్ల ప్రజలకు నష్టమే జరిగింది. కానీ ఇప్పుడు తెలంగాణలో రైతులు, పేదల సంక్షేమం కోసం నిలబడేది ఇందిరమ్మ రాజ్యమే,” అని తెలిపారు.