Nikhita Nagdev: పాకిస్తాన్‌లోని కరాచీకి చెందిన నిఖితా నాగ్దేవ్ అనే మహిళ.. తన భర్త మోసం చేశాడని ఆరోపిస్తూ, తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసింది. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాకిస్తాన్ మూలాలు కలిగి, దీర్ఘకాలిక వీసాపై మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో నివసిస్తున్న విక్రమ్ నాగ్దేవ్తో నిఖితకు 2020 జనవరి 26న కరాచీలో హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం జరిగింది. వివాహానంతరం, ఫిబ్రవరి 26న నిఖితను విక్రమ్ భారత్‌కు తీసుకొచ్చాడు. అయితే, కొన్ని నెలలకే వీసా సమస్యల పేరు చెప్పి, 2020 జూలై 9న అటారీ సరిహద్దు వద్ద నుంచి బలవంతంగా ఆమెను తిరిగి పాకిస్తాన్‌కు పంపించేశాడని నిఖిత ఆరోపిస్తోంది. అప్పటి నుంచి తనను భారత్‌కు తిరిగి తీసుకువచ్చేందుకు విక్రమ్ ప్రయత్నించలేదని ఆమె వాపోయింది.
Also Read: Nara Lokesh: ఏపీ పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్ అమెరికా, కెనడా పర్యటన
ప్రస్తుతం తన భర్త విక్రమ్ నాగ్దేవ్ ఢిల్లీకి చెందిన శివాంగి ధింగ్రా అనే మరో మహిళతో నిశ్చితార్థం చేసుకున్నాడని, 2026 మార్చి చివరి వారంలో వారి వివాహం జరగనుందని నిఖిత ఆరోపించింది. తనతో విడాకులు తీసుకోకుండానే విక్రమ్ మరో పెళ్లికి సిద్ధమవుతున్నాడని, ఇది మోసమని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నిఖిత చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉన్న సింధీ పంచ్ మధ్యవర్తిత్వ కేంద్రం దృష్టికి వెళ్లింది.
విచారణ జరిపిన సింధీ పంచ్, భార్యాభర్తలిద్దరూ భారత పౌరులు కాకపోవడంతో ఈ కేసు భారత న్యాయస్థానం పరిధిలోకి రాదని అభిప్రాయపడింది. అయితే, విక్రమ్ నాగ్దేవ్ భారత పౌరసత్వం లేకుండానే దీర్ఘకాలంగా దేశంలో నివసిస్తూ, ప్రభుత్వ అనుమతి లేకుండా ఆస్తులు కొనుగోలు చేశాడనే ఆరోపణలు రావడంతో.. అతడిని భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాకిస్తాన్‌కు దేశ బహిష్కరణ చేయాలని 2025 ఏప్రిల్/మే నెలల్లో సింధీ పంచ్‌తో పాటు స్థానిక సామాజిక పంచాయితీ కూడా సిఫార్సు చేసింది.ఈ పరిణామాల నేపథ్యంలో, ఇండోర్ కలెక్టర్ కూడా ఈ విషయంపై విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే, తనకు న్యాయం చేయకపోతే న్యాయవ్యవస్థపై మహిళలకు నమ్మకం పోతుందని, దయచేసి తనకు అండగా నిలవాలని కోరుతూ నిఖితా నాగ్దేవ్ ప్రధాని మోదీని వీడియో ద్వారా వేడుకుంది.

