IndiGo Crisis: దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసుల రద్దు సంక్షోభం (IndiGo Crisis) కారణంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక ఎయిర్‌పోర్టుల్లో గంటల తరబడి పడిగాపులు కాస్తూ, తమ ప్రయాణం కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో, ప్రయాణికులకు రీఫండ్‌లు, ఇతర సాయం అందించడంపై ఇండిగో సంస్థ కీలక ప్రకటన విడుదల చేసింది.
త్వరలో రీఫండ్‌లు: ఇండిగో హామీ
రద్దయిన విమానాలకు సంబంధించిన టికెట్ల సొమ్మును సాధ్యమైనంత త్వరగా ప్రయాణికులకు చెల్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇండిగో తెలిపింది. సంక్షోభ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులకు అండగా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించింది.
రద్దయిన విమానాలకు సంబంధించి రీఫండ్‌లు, రీషెడ్యూలింగ్‌లపై మినహాయింపులను అందించేందుకు బోర్డు సభ్యులు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని పేర్కొంది.
ఇది కూడా చదవండి: Hyderabad: అంత్యక్రియలకు డబ్బుల్లేక 3 రోజులు మృతదేహంతో నివసించిన కుటుంబం
‘CMG’ ఏర్పాటు – బోర్డు అత్యవసర సమావేశం
విమానాల రద్దుకు దారి తీసిన కారణాలు, సంక్షోభం నుంచి బయటపడే మార్గాలపై చర్చించడానికి సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు అత్యవసర సమావేశం నిర్వహించారు. సమస్యను సమగ్రంగా పరిశీలించిన తర్వాత, కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
సంక్షోభాన్ని సమర్థవంతంగా నిర్వహించడం కోసం, సీఈవో సహా బోర్డు సభ్యులు కలిసి క్రైసిస్ మేనేజ్‌మెంట్ గ్రూప్ (CMG) ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
సంక్షోభం నుంచి ఇండిగో బయటపడేందుకు అవసరమైన చర్యలను ఈ గ్రూప్ చేపడుతుంది. విమాన సర్వీసుల పునరుద్ధరణను వేగవంతం చేయడానికి ఈ బృందం కృషి చేయనుంది. ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులకు పూర్తి సాయం, సహకారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తుంది.
ప్రస్తుతం కొనసాగుతున్న ఈ సంక్షోభంపై ఇండిగో తీసుకున్న ఈ నిర్ణయాలు, తమ సేవలను త్వరగా సాధారణ స్థితికి తీసుకురావడానికి, అలాగే ప్రయాణికులకు ఉపశమనం కలిగించడానికి ఉద్దేశించినవిగా కనిపిస్తున్నాయి.

