Nimisha Priya Case: యెమెన్‌లో మరణశిక్షను ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిష ప్రియ కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. ఆమెకు విధించిన ఉరిశిక్ష రద్దయిందంటూ సోమవారం అర్ధరాత్రి వచ్చిన వార్తలను భారత ప్రభుత్వం తోసిపుచ్చింది. ఇవి అవాస్తవాలని, మరణశిక్ష రద్దు కాలేదని కేంద్ర విదేశాంగ శాఖ వర్గాలు మంగళవారం స్పష్టం చేశాయి.
నిమిష ప్రియ మరణశిక్షను రద్దు చేయడానికి యెమెన్ అధికారులు నిర్ణయించారని భారత గ్రాండ్ ముఫ్తీ, సున్నీ నాయకుడు కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం సోమవారం రాత్రి ఒక ప్రకటన చేసింది. భారత గ్రాండ్ ముఫ్తీ విజ్ఞప్తి మేరకు, యెమెన్‌లోని ప్రముఖ సూఫీ పండితుడు షేక్ హబీబ్ ఒమర్ బిన్ హఫీజ్ ఒక బృందాన్ని చర్చల కోసం నియమించారని, ఆ బృందం యెమెన్ ప్రభుత్వంతో చర్చలు జరిపిందని, అవి ఫలించడంతో మరణశిక్ష రద్దుకు అంగీకరించారని ముఫ్తీ కార్యాలయం పేర్కొంది.
అయితే, ఈ ప్రకటనపై భారత విదేశాంగ శాఖ (MEA) వర్గాలు వెంటనే స్పందించాయి. నిమిష ప్రియ కేసులో కొంతమంది వ్యక్తుల నుంచి వస్తున్న సమాచారం సరైంది కాదని తేల్చి చెప్పాయి. యెమెన్ నుంచి తమకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని స్పష్టం చేశాయి. దీంతో, నిమిష ప్రియ కేసు మళ్లీ మొదటికి వచ్చినట్లయ్యింది, ఉత్కంఠ కొనసాగుతోంది.
Also Read: Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు షాక్?
కేరళకు చెందిన నిమిష ప్రియ, యెమెన్ దేశస్థుడైన తలాల్ అబ్దో మహదీతో కలిసి అక్కడ ఒక క్లినిక్‌ను ప్రారంభించింది. అయితే, వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో తలాల్ నిమిషపై వేధింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో, నిమిష మరో వ్యక్తి సహాయంతో తలాల్‌కు మత్తు మందు ఇచ్చింది. దురదృష్టవశాత్తు, ఆ మత్తు మందు అధిక మోతాదు కావడంతో తలాల్ మరణించాడు. ఈ కేసులో యెమెన్ ప్రభుత్వం నిమిష ప్రియకు మరణశిక్ష విధించింది.
నిమిష ప్రియకు జులై 16న మరణశిక్ష అమలు కావాల్సి ఉండగా, చివరి నిమిషంలో యెమెన్ ప్రభుత్వం దాన్ని వాయిదా వేసింది. ‘బ్లడ్ మనీ’ (రక్త పరిహారం) చెల్లింపుపై బాధితుడి కుటుంబంతో చర్చలు జరిపేందుకు భారత్ చేసిన అభ్యర్థనను యెమెన్ అంగీకరించింది. అప్పటి నుండి భారత ప్రభుత్వం యెమెన్ అధికారులతో కేసు పరిష్కారానికి ప్రయత్నిస్తోంది. అయితే, తలాల్ కుటుంబం ‘బ్లడ్ మనీ’కి ఎప్పటికీ అంగీకరించబోమని గట్టిగా చెబుతోంది. ఈ నేపథ్యంలో నిమిష ప్రియ భవిష్యత్తు ఎలా ఉంటుందనే దానిపై ఇంకా స్పష్టత లేదు.

