Netflix: ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్షిణాది సినిమా మార్కెట్‌పై కీలక నిర్ణయం తీసుకోవడంతో టాలీవుడ్, కొల్లీవుడ్ నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు సౌత్ సినిమాలను భారీ ధరలకు కొనుగోలు చేసి పెద్ద ఆదాయాన్ని అందించిన నెట్‌ఫ్లిక్స్, ఇకపై అదే విధానాన్ని కొనసాగించబోమని స్పష్టం చేసినట్లు పరిశ్రమలో చర్చ జరుగుతోంది. ఇటీవల థియేటర్లలో సరిగా నడవని సినిమాలను కూడా ఎక్కువ మొత్తానికి తీసుకోవడంతో కంపెనీకి భారీ నష్టాలు వచ్చినట్టు తెలిసింది. ఈ పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని కొత్త స్ట్రాటజీకి మారాలని నెట్‌ఫ్లిక్స్ నిర్ణయించినట్టు సమాచారం.
సౌత్ సినిమాల కొనుగోలు సంఖ్యను గణనీయంగా తగ్గించి, ఆ బడ్జెట్ మొత్తాన్ని తమ సొంత ఒరిజినల్ కంటెంట్ నిర్మాణానికి కేటాయించనున్నారు. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో వెబ్ సిరీస్‌లు, రియాలిటీ షోలు, ఒరిజినల్ సినిమాలపై పూర్తి ఫోకస్ పెట్టాలని కంపెనీ భావిస్తోంది. ఈ దిశగా హైదరాబాద్‌లో కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, ఒరిజినల్ కంటెంట్ డెవలప్మెంట్ పనులను వేగవంతం చేసింది. మంచి సౌత్ కథలను వెతకడం, కొత్త దర్శకులను ప్రోత్సహించడం, భారత మార్కెట్‌కు సరిపడే ప్రీమియం స్థాయి కంటెంట్‌ను రూపొందించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
Also Read: Ram Charan: ఫ్యాన్స్ లో కన్ఫ్యూజన్.. రిలీజ్ డేట్ మార్చుకున్న పెద్ది?
ఇటీవలి కాలంలో థియేటర్లలో ప్రేక్షకులు తగ్గిపోవడంతో నిర్మాతలు భారీ నష్టాలను ఎదుర్కొన్నారు. శాటిలైట్ హక్కుల అమ్మకాలూ తగ్గిపోవడంతో సినిమా లాభాలు తగ్గాయి. ఈ నేపథ్యంలో స్టార్ హీరోల సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ ఇచ్చే భారీ మొత్తాలు నిర్మాతలకు ఆర్థికంగా పెద్ద సహాయం చేసేవి. కానీ థియేటర్లలో ఫ్లాప్ అయితే ముందుగా చెప్పిన మొత్తాన్ని భారీగా తగ్గించడం వల్ల సమస్యలు మరింత పెరిగాయి. ఇప్పుడు పూర్తిగా పెద్ద మొత్తాలు చెల్లించే విధానాన్ని తగ్గిస్తుండడంతో నిర్మాతలు ఎదుర్కొనే సవాళ్లు మరింత పెరగనున్నాయి.
నిర్మాణ ఖర్చులు పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో, నెట్‌ఫ్లిక్స్ వంటి ప్రీమియం వేదిక నుంచి పెద్ద ఆఫర్లు రాకపోతే భారీ బడ్జెట్ సినిమాలు చేయడం కష్టమవుతుంది. పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం, భవిష్యత్తులో నిర్మాతలు కథలకు సరిపోయే విధంగా బడ్జెట్ తగ్గించుకోవడం, లేకపోతే స్టార్ హీరోలు తమ రెమ్యునరేషన్‌ను తగ్గించడం తప్ప వేరే మార్గం ఉండకపోవచ్చు. ఈ నిర్ణయం చిన్న మధ్యస్థాయి నిర్మాతలకు మాత్రమే కాకుండా, పెద్ద సినిమాలపై ఆధారపడే స్టార్ హీరోల మార్కెట్‌పైనా ప్రభావం చూపే అవకాశముంది.

