National Games: ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న 38వ జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టి. సత్యజ్యోతి కాంస్య పతకం సాధించింది. వెయిట్ లిఫ్టింగ్‌లో 87+ కిలోల విభాగంలో ఆమె ఈ ఘనతను అందుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ సత్యజ్యోతిని ప్రశంసించారు. ఆమెకు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు.
ఈ ఏడాది జరుగుతున్న జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు వరుసగా సత్తా చాటుతున్నారు. ఇప్పుడు తాజాగా విజయనగరం జిల్లాకు చెందిన సత్య జ్యోతి వెయిట్ లిఫ్టింగ్ లో కాంస్య పథకం అందుకుంది. ఈ ఘనత సాధించిన ఈమెను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రశంసిస్తూ ఇలా సోషల్ మీడియా మాధ్యమం – X ద్వారా ఒక పోస్ట్ వేశారు.
“విజయనగరం జిల్లాకు చెందిన సత్యజ్యోతికి అభినందనలు. ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న జాతీయ క్రీడల్లో సత్యజ్యోతి వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో 87+ కిలోల కేటగిరీలో కాంస్య పతకం సాధించిన నువ్వు మరింత శక్తితో ముందుకెళ్లి మున్ముందు రాష్ట్రానికి మరియు దేశానికి మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నాను అమ్మా!” అని ముఖ్యమంత్రి చంద్రబాబు పోస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Virat Kohli: ఫ్యాన్స్ తిట్టినా… అతనిని కోహ్లీ మాత్రం మెచ్చుకున్నాడు..!
మంత్రి లోకేశ్ కూడా సత్యజ్యోతి విజయాన్ని ప్రశంసించడానికి X ద్వారా ఒక పోస్ట్ వేసి కాంస్య పతకం సాధించినందుకు అభినందనలు తెలిపారు. “నీ కష్టపడిన తీరు, నీ ప్రయత్నం, అంకితభావం, స్ఫూర్తి, అందరికీ ప్రేరణ. నువ్వు వెయిట్ లిఫ్టింగ్‌లో అడ్డంకులను అధిగమించి ఎదిగావు, ఇది భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం. నీవు ఎప్పుడూ విజయాలు సాధిస్తూ మరింత ఎదగాలని ఆశిస్తున్నాను” అని లోకేశ్ తన X అకౌంట్లో పేర్కొన్నారు.
వెయిట్ లిఫ్టింగ్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇప్పటికే పురుషుల 67 కిలోల విభాగంలో నీలం రాజు, మహిళల 71 కిలోల విభాగంలో పల్లవి స్వర్ణ పతకాలు సాధించారు. తాజాగా, 87+ కిలోల విభాగంలో టి. సత్యజ్యోతి కాంస్య పతకం సాధించింది.

