Nagarjuna

Nagarjuna: కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా ఉపసంహరణ

Nagarjuna: తెలంగాణ మంత్రి కొండా సురేఖ, ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున మధ్య నెలకొన్న వివాదం ఒక కొలిక్కి వచ్చింది. నాగార్జున కుటుంబంపై తాను చేసిన వ్యాఖ్యలకు మంత్రి సురేఖ బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతో, ఆమెపై దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం దావాను నాగార్జున ఉపసంహరించుకున్నారు. ఈ నిర్ణయంతో మంత్రి సురేఖకు పెద్ద ఊరట లభించినట్లయింది.

గతంలో, 2024 అక్టోబరు 2న హైదరాబాద్‌లోని లంగర్ హౌస్‌లో మీడియాతో మాట్లాడిన మంత్రి కొండా సురేఖ, నటులు నాగచైతన్య, సమంత విడాకులకు మాజీ మంత్రి కేటీఆరే కారణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అక్కినేని కుటుంబంతో పాటు, తెలంగాణ రాజకీయాల్లోనూ తీవ్ర దుమారం రేపాయి.

దీంతో ఈ అనుచిత వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన కింగ్ నాగార్జున, కొండా సురేఖపై భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సెక్షన్ 356 కింద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో దావా దాఖలు చేశారు.

Also Read: jubliee hills By elections 2025: మ‌ధ్యాహ్నంలోపే జూబ్లీహిల్స్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డి

కోర్టులో ఉపసంహరణ, వివాదానికి ఎండ్ కార్డ్
ఈ కేసు విచారణ జరుగుతున్న క్రమంలో, మంత్రి కొండా సురేఖ ఇప్పటికే రెండుసార్లు క్షమాపణలు చెప్పినా, నిన్న (బుధవారం, నవంబర్ 13) రాత్రి మరోసారి తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా ద్వారా క్షమాపణలు చెప్పారు.

“నాగార్జునను కానీ, ఆయన కుటుంబాన్ని బాధ పెట్టాలనే ఉద్దేశంతో నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు. నా వ్యాఖ్యల్లో ఏదైనా పొరపాటు ఉంటే చింతిస్తున్నా, వాటిని ఉపసంహరించుకుంటున్నాను” అని సురేఖ స్పష్టం చేశారు.

మంత్రి పశ్చాత్తాపం చెందడాన్ని పరిగణలోకి తీసుకున్న నాగార్జున, ఈ వివాదాన్ని ఇక పెద్దది చేసుకోవద్దని భావించి, నేడు (గురువారం) నాంపల్లి స్పెషల్ కోర్టులో పరువు నష్టం దావాను ఉపసంహరించుకున్నారు. ఈ కీలక పరిణామంతో అక్కినేని ఫ్యామిలీ, మంత్రి సురేఖ మధ్య నెలకొన్న వివాదం పూర్తిగా సమసిపోయినట్లయింది. ఈ నిర్ణయం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *