Nadendla manohar: జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించలేక ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత లేకపోవడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా మోసం చేయడం, అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని సంక్షోభంలో నెట్టడం వంటి విషయాలను ఆయన ఎత్తిచూపారు. గత ఐదేళ్లలో విద్యార్థులను మోసం చేసిన వైసీపీ, ఇప్పుడు “యువత పోరు” అంటూ కార్యక్రమాలు నిర్వహించడం హాస్యాస్పదమని ఆయన అన్నారు.
కాకినాడలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ వ్యవస్థలను వైసీపీ నాయకులు తమ వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకున్నారని మండిపడ్డారు. యువత, విద్యార్థుల ఆకాంక్షలను నీరుగార్చిన వైసీపీ, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజల నుండి గుణపాఠం అందుకున్నదని వ్యాఖ్యానించారు. వాలంటీర్ల గడువు ముగిసినా పొడిగించేందుకు ప్రభుత్వం జీవో కూడా జారీ చేయలేదని, ఎన్నికల సమయంలో వాలంటీర్లను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుని మోసం చేశారని అన్నారు.
పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. సభలో భద్రత, పార్కింగ్, మెడికల్ సేవలు వంటి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు చెప్పారు. ప్రజల సౌకర్యార్థం 14 అంబులెన్సులు, 7 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పార్టీ అభివృద్ధిని ప్రతిబింబించే విధంగా ప్రత్యేక దృశ్యరూపాలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఈ సభలో విద్యార్థులు, రైతులు, మహిళలు, మత్స్యకారులు తమ అభిప్రాయాలను వ్యక్తపరచేందుకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు.
పేదలకు అధికారం అందించడం జనసేన ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. సభ విజయవంతం కావడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు.

