Rangareddy: రంగారెడ్డి జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది.హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగమణిని సొంత సోదరుడు పరమేశ్ ఇబ్రహీంపట్నంలో దారుణంగా హత్య చేశాడు. ఇటీవల కానిస్టేబుల్ నాగమణి, రాయపోల్ ప్రాంతానికి చెందిన శ్రీకాంత్ ప్రేమ వివాహం చేసుకున్నారు. నవంబర్ ఒకటో తేదీన వీరి వివాహం యాదగిరిగుట్టలో జరిగింది. వివాహం అనంతరం హయత్ నగర్ లో దంపతులు నివాసం ఉంటున్నారు. ప్రేమించి, పెళ్లి చేసుకోవడంతో కుటుంబ సభ్యులు నాగమణిపై ఆగ్రహంతో ఉన్నారు.
నిన్న సెలవు కావడంతో నాగమణి తన సొంత గ్రామానికి వెళ్ళింది. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం డ్యూటీకి వెళ్లొస్తున్న నాగమణిని రాయపోలు – మన్నెగూడ మార్గంలో పరమేశ్ కారుతో ఢీకొట్టాడు. అనంతరం ఆమెను కత్తితో నరికి చంపాడు. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్య చేసిన పరమేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

