MP Sri Bharat: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)కి ఏ మాత్రం ఇష్టం లేదని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు (ఎంపీ) శ్రీభరత్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవడమే వైసీపీ విధానంగా మారిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రం ఎదుగుదలను విధ్వంసం, నాశనంతో పోలుస్తున్నారని, పేదలను ఎప్పుడూ పేదరికంలోనే ఉంచాలనేది వారి సిద్ధాంతమని ఘాటుగా విమర్శించారు.
విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Partnership Summit) సందర్భంగా శ్రీభరత్ మీడియాతో మాట్లాడారు. ఈ సదస్సు ద్వారా సుమారు రూ.9.8 లక్షల కోట్లు విలువైన పెట్టుబడుల ఒప్పందాలు (MoUs) చేసుకునే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం ఐటీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఎంతో కృషి చేస్తుంటే, ఇలాంటి కీలక సమయంలో వైసీపీ నేతలు ర్యాలీలు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
ప్రపంచస్థాయి పెట్టుబడుల సదస్సు జరుగుతుంటే.. వైసీపీ ర్యాలీలు చేస్తోంది. దీనివల్ల రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుంది. ర్యాలీలు చేయాలంటే మరో సమయంలో చేసుకోవచ్చు. కావాలనే ర్యాలీల పేరుతో పెట్టుబడులను డైవర్ట్ చేయాలని చూస్తే, ప్రభుత్వం చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటుంది అని ఎంపీ భరత్ హెచ్చరించారు.
గతంలో జగన్ ప్రభుత్వం పేదలకు మేలు చేసే పథకాలను తీసేసిందని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన మంచి సంస్థలను కూడా వెనక్కి పంపించేసిందని శ్రీభరత్ ఆక్షేపించారు. పరిశ్రమలకు భూములు కావాలన్నా, మెడికల్ కళాశాలల కోసం పెట్టుబడులు వస్తున్నా వైసీపీ నేతలు ఆందోళనలతో అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. “నిజంగానే కళాశాలలపై ప్రేమ ఉంటే రుషికొండపై ఉన్న భవనం కోసం రూ.500 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు? ఆ డబ్బుతో ఉత్తరాంధ్రలో మెడికల్ కాలేజీలు పూర్తి అయ్యేవి కదా?” అని ఆయన ప్రశ్నించారు.
Also Read: AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. 65కు పైగా అంశాలకు ఆమోదం!
రాష్ట్రం ప్రస్తుతం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పటికీ, ప్రభుత్వం అన్నింటినీ సమన్వయం చేస్తూ ముందుకు వెళుతోందని శ్రీభరత్ వివరించారు. ఖర్చులను ఎంత తగ్గించుకుంటుందో చెప్పడానికి ఒక ఉదాహరణ ఇచ్చారు. గతంలో ముఖ్యమంత్రి పర్యటనకు రూ.7 కోట్లు ఖర్చు అయ్యేది, కానీ ఇప్పుడు అది కేవలం రూ.25 లక్షలకు తగ్గించామని తెలిపారు. ఇది రాష్ట్రం ఎంత తక్కువ ఖర్చుతో పనులు చేస్తుందో చెప్పడానికి నిదర్శనమన్నారు.
వైసీపీ నేతల తీరుపై శ్రీభరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “వైసీపీలో బండ బూతులు తిడితే నామినేటెడ్ పదవి, ఏకంగా హత్య చేస్తే మంత్రి పదవి ఇస్తారు. గంజాయి కేసులో ఉన్నవారిని కూడా జైలుకు వెళ్లి జగన్ పరామర్శించారు” అని సెటైర్ వేశారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ నాయకుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదని, ఏపీని విధ్వంసం, నాశనం చేయడంలో వైసీపీ నేతలు పీహెచ్డీ చేశారని ఎద్దేవా చేశారు.
ప్రజల భవిష్యత్తు ముఖ్యమా, లేక స్వార్థ ప్రయోజనాలు ముఖ్యమా అనేది ప్రజలు ఆలోచించాలని ఆయన సూచించారు. కూటమి ప్రభుత్వం పెట్టుబడులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, వైజాగ్ వస్తున్న పరిశ్రమలకు త్వరలోనే శంకుస్థాపనలు జరుగుతాయని, త్వరగా గ్రౌండ్ వర్క్ పూర్తి చేసి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని ఎంపీ శ్రీభరత్ స్పష్టం చేశారు.

