Medak Crime News: వీడు అలాంటిలాంటి దొంగ కాదు.. అందరిలాగా చోరీ చేసి, చేసిన వస్తువులతో బయటపడలేదు. ఎవరైనా చూస్తారేమో, ఎప్పుడు బయటకెళ్దామా? అన్న భయమూ వీడిలో లేనే లేదు. ఎవరికైనా దొరికితే ఎలా అన్న సంశయమూ వీడికి రాలేదు. అసలు వీడు ఇంతకు ముందు దొంగతనం చేశాడా? చేయలేదా? ఇదే మొదటిసారిదా? ఏమో తెలియదు కానీ, ఈ దొంగ పనితనం చూస్తే కోపం రావడం కంటే, అందరికీ నవ్వొస్తుంది. అదేమిటో చూద్దాం రండి.
Medak Crime News: మెదక్ జిల్లా నార్సింగిలో కనకదుర్గ వైన్‌షాపు ఉన్నది. ఈ వైన్ షాపులో ఓ దొంగ పడ్డాడు. నిన్న రాత్రి పైన ఉన్న ఒక రేకును తొలగించిన ఆ దొంగ లోపలికి దిగాడు. అక్కడ ఎవరూ లేరు. ఎంచక్కా పెద్ద పెద్ద ఫుల్, ఆఫ్, క్వార్టర్ సీసాలు, ఖరీదైనవి, సాధారమైనవి పేర్చి ఉన్నాయి. వాడి కండ్లు జిగేల్ మన్నాయి. ఈ దొంగతనానికి వెళ్లిన మరొకడైతే ఏం జేసేవాడు.. కౌంటర్లో ఉంటే నగదు, ఖరీదైన ఫుల్ బాటిళ్లు చేతికందినంత తీసుకొని ఉడాయించేస్తాడు. కానీ ఈ దొంగ అలా చేయలేదు. ఎందుకంటే వీడు అలాంటిలాంటి దొంగ కాదన్నానుగా.
Medak Crime News: వీడు ఇంకో దొంగలెక్కే ఎంచక్కా మద్యం బాటిళ్లను వెంట తెచ్చుకున్న ఓ సంచిలో మూట కట్టుకున్నాడు. కౌంటర్‌లో ఉన్న నగదును జేబుల్లో నింపుకున్నడు. ఇక బయటకు ఉడాయించడమే వీడి వంతు. పోతూ పోతూ వీడికి మరో మందు బాటిల్‌పై కన్ను పడింది. ఎవరూ లేరనుకున్నాడు, ఇప్పట్లో రారు అనుకున్నాడో ఏమో.. ఆ బాటిల్‌ను అందుకొని గడగడా లాంగించేశాడు. మంచినీళ్లు లేకుండా పచ్చి మందునే తాగినట్టుంది.
Medak Crime News: సీన్ కట్ చేస్తే.. వైన్ షాప్ సిబ్బంది యాధాప్రకారంగా తెల్లారి ఉదయం మద్యం షాపు తెరిచారు. లోపలి సీన్‌ను చూస్తే అవాక్కవడం వారి వంతయింది. మనోడు (దొంగ గారు) ఎంచక్కా పండుకొని గాఢ నిద్రలోనే ఉన్నాడు. ఇంకా వాడికి రాత్రి మందు మత్తు వదలలేదు అన్నమాట. అయ్యవారిని నిద్ర నుంచి లేపి, ఈ లోగా పోలీసులకు సమాచారం ఇవ్వగా వారొచ్చి మర్యాదపూర్వకంగా తోలుకెళ్లారు. ఇదన్న మాట మ్యాటర్.