Malreddy rangareddy: రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వడంలో సామాజిక సమీకరణాలు అడ్డొస్తే, తాను రాజీనామా చేసి ఎవరినైనా గెలిపించేందుకు సిద్ధమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రకటించారు.
ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, “రంగారెడ్డి జిల్లా కార్యకర్తలకు అన్యాయం చేయకూడదు. జిల్లా అభివృద్ధి కోసం అవసరమైతే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను” అని స్పష్టం చేశారు.
జిల్లాకు మంత్రి ప్రాతినిధ్యం అవసరమని, అవసరమైతే తన పదవికి రాజీనామా చేసేందుకు కూడా వెనుకాడనని పేర్కొన్నారు. “ఇటీవల పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చారు. కానీ పార్టీ కోసం నిజాయితీగా కష్టపడిన వారిని పక్కన పెట్టడం సరికాదు” అని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
పార్టీలో కొత్తగా చేరిన వారిని గౌరవించాల్సిందే కానీ, వారికి మంత్రి పదవులు ఇవ్వడం మాత్రం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోనే అధిక జనాభా కలిగిన రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి లభించాలని మల్రెడ్డి రంగారెడ్డి డిమాండ్చేశారు.