Liquor Policy: రాష్ట్రంలో సోమవారం (డిసెంబర్ 1) నుంచి కొత్త మద్యం పాలసీ అమలులోకి వస్తుంది. కొత్త దుకాణాలు తమ అమ్మకాలు ప్రారంభించనున్నాయి. ఇటీవల జరిగిన లాటరీ పద్ధతిలో దుకాణాలను దక్కించుకున్న వ్యాపారులు తమ వ్యాపారాన్ని షురూ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2620 మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల చొప్పున చెల్లించి, లాటరీ పద్ధతిలో దక్కించుకున్నారు. వారికి ఈరోజు నుంచి రెండేళ్లపాటు (2025-27) మద్యం లైసెన్స్ ఉంటుంది.
Liquor Policy: రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలతోపాటు కొత్తగా 40 వేల బెల్ట్ దుకాణాలు రాబోతున్నట్టు అంచనా ఉన్నది. దీంతో రాష్ట్ర ఖజానాకు కోట్లాది రూపాయల ఆదాయం సమకూరింది. వీటితోపాటు రాష్ట్రంలోని గ్రామగ్రామాన బెల్ట్ షాపులను కలుపుకుంటే 1.45 లక్షలు ఉన్నట్టు అంచనా. దీంతో మద్యం ఏరులై పారనున్నది. ఇటీవలే మద్యం దుకాణాల విచ్చలవిడి ఏర్పాటుపై హైకోర్టు ప్రభుత్వాన్ని హెచ్చరించింది. నివాసాల మధ్య ఏర్పాటుపైనా అభ్యంతరాలను వ్యక్తంచేసింది.
Liquor Policy: నిరుడు మద్యం దుకాణాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రూ.71,550 కోట్ల మద్యం వ్యాపారం సాగినట్టు అంచనా. గత రెండేళ్లలో 724 లక్షల కేసుల మద్యం, 960 లక్షల కేసుల బీర్ల వ్యాపారం జరిగింది. ఈసారి మద్యం వ్యాపారం పెరుగుదలకు ప్రధాన అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం పంచాయతీ, త్వరలో జరగనున్న పరిషత్, మున్సిపాలిటీ ఎన్నికల్లో మద్యం విక్రయాలు పెరగనున్నాయి. ఈ ఏడాది జరగనున్న మేడారం జాతర సందర్భంగా విక్రయాలు పెరగనున్నాయి.

