Lagacharla:వికారబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లతోపాటు సమీప గ్రామాల్లో ఫార్మా కంపెనీల నోటిఫికేషన్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. పోరాటం ఫలించిందని రైతులు, వారి కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ మరో రకమైన పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండటంతో మళ్లీ వారిలో భయాందోళన గూడుకట్టుకొని ఉన్నది. తమ కుటుంబాలకు జీవనోపాధిని కల్పించే భూములను వదులుకోబోమని చెప్తున్న రైతులు.. ఒప్పుకుంటారా? ప్రభుత్వం ఎలా ఒప్పిస్తుందో? చూడాలి మరి.
Lagacharla:ఫార్మా కంపెనీల ఏర్పాటు నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ మరునాడే లగచర్ల, పోలేపల్లి గ్రామాల పరిధిలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం భూసేకరణకు నోటిఫికేషన్‌ను జారీచేసింది. ఆ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం లగచర్లలో 110.32 ఎకరాలు, పోలేపల్లి గ్రామ పరిధిలో 71.39 ఎకరాల భూమిని సేకరించాలని ఆ జీవోలో పేర్కొన్నది. అంటే ఎలాగైనా ఆయా గ్రామాల్లో భూసేకరణకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదనే విషయం తేటతెల్లమైంది.
Lagacharla: ఫార్మా కంపెనీల ఏర్పాటుతో కాలుష్యకారకంగా ఆ ప్రాంతాలు మారుతాయని, ఇతర కాలుష్యం వెదజల్లని పరిశ్రమలను తీసుకొచ్చి, ఆ ప్రాంతంలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే అసలు తమకు జీవనం కల్పించే భూములనే వదులుకోబోమని ఆయా ప్రాంతాల గిరిజనులు తేల్చి చెప్తున్నారు. ఇప్పటికే లగచర్ల దాడి ఘటనతో పలువురు సంగారెడ్డి జైలులో ఉన్నారు. పలువురు బిక్కుబిక్కుమంటూ ఊళ్లిడిచి వేరే చోట తలదాచుకుంటున్నారు.
Lagacharla: ఈ దశలో మళ్లీ భూముల సేకరణ అటు ప్రభుత్వానికి ఇటు రైతు కుటుంబాలకు సమస్యగానే మారనున్నది. పుండుమీద కారం చల్లినట్టుగా ఉంటదని ప్రజాస్వామిక వాదులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం పరిశ్రమలు పెట్టదల్చుకుంటే ప్రభుత్వ భూములు అధికంగా ఉన్నచోట్ల పెట్టాలని బీఆర్ఎస్ సహా ఇతర పార్టీలు, సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ దశలో ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.