KTR: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరులో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య రాజకీయ కక్షలు తీవ్ర స్థాయిలో భగ్గుమన్నాయి. ఈ రోజు ఉదయం బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేసి, కార్యాలయాన్ని దహనం చేసిన ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
అసలేం జరిగింది?
దాడికి పాల్పడిన కాంగ్రెస్ కార్యకర్తలు తొలుత బీఆర్‌ఎస్ కార్యాలయం ఆవరణలోకి చొచ్చుకెళ్లి ఫ్లెక్సీలు, బ్యానర్లను చింపివేశారు. ఆ తర్వాత లోపలికి వెళ్లి ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి, వాటికి పెట్రోల్ పోసి నిప్పంటించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
వివాదానికి కారణం:
ఈ దాడికి కారణం కార్యాలయ భవనంపై ఉన్న ఆక్రమణ వివాదమే అని తెలుస్తోంది. ఈ భవనం గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా ఉండేదని, అయితే మాజీ విప్ రేగా కాంతారావు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత బీఆర్‌ఎస్‌లో చేరినప్పుడు, అధికార అండతో దానిని బీఆర్‌ఎస్ కార్యాలయంగా మార్చేశారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఇటీవల ఎన్నికల్లో రేగా కాంతారావు ఓడిపోవడంతో, కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్తేజంతో పాత కార్యాలయాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఈ దాడికి పాల్పడ్డారు.
Also Read: Butta Renuka Out: బుట్టమ్మ కథ మళ్లీ మొదటికే వచ్చిందా..!!
కేటీఆర్ తీవ్ర స్పందన, మణుగూరుకు పయనం:
ఈ ఘటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను ‘గూండాలు’, ‘రౌడీ మూకలు’ గా అభివర్ణించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గూండాల రాజ్యం, అరాచకత్వం పెరిగిపోయిందని, గ్రామ స్థాయి నుంచి రాజధాని దాకా ఇదే నడుస్తోందని మండిపడ్డారు.
జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావుతో ఫోన్‌లో మాట్లాడిన కేటీఆర్, మణుగూరు పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పారు. “60 లక్షల భారత రాష్ట్ర సమితి కుటుంబం మొత్తం మణుగూరు పార్టీ శ్రేణులకు అండగా ఉంటుంది” అని హామీ ఇచ్చారు. త్వరలోనే తాను మణుగూరును సందర్శించి, అదే స్థలంలో కొత్త పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేసి నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు. ఈ అరాచకత్వానికి చరమగీతం పాడే రోజు దగ్గర్లో ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

