Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎస్సీలకు రిజర్వ్ అయిన ఈ సర్పంచ్ పదవికి సీఎం రేవంత్ రెడ్డి క్లాస్మేట్ అయిన వెంకటయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవి కోసం మొదట్లో దాదాపు 15 మంది పోటీ పడినప్పటికీ, గ్రామంలోని పెద్దలు ఏకతాటిపైకి వచ్చి చర్చలు జరిపారు. చివరికి, గ్రామ పెద్దలు సీల్డ్ కవర్లో వెంకటయ్య పేరును ప్రకటించడంతో, అందరూ అంగీకరించి ఆయన ఎన్నికను ఏకగ్రీవం చేశారు. దీంతో సీఎం స్వగ్రామంలో ఎన్నికల రగడ లేకుండా సర్పంచ్ ఎంపిక ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.
ఇది కూడా చదవండి: Allari Naresh: అల్లరి నరేష్ పరిస్థితేంటి..‘ఆల్కహాల్’ సినిమా విడుదల వాయిదా?
వెంకటయ్య 1994లో మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2000 సంవత్సరం వరకు చురుగ్గా పనిచేశారు. అనంతరం 2001లో పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. 2003 నుంచి కల్వకుర్తి పోలీస్స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో కొండారెడ్డిపల్లిని రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. తనకు మద్దతిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ కమిషన్ సభ్యుడు కేవీఎన్ రెడ్డి, గ్రామస్థులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

