Khammam: రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు (జనవరి 26) నుంచి ప్రారంభించనున్న నాలుగు పథకాల పైలట్ ప్రాజెక్టు విషయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సొంత ఇలాకాలో గందరగోళం నెలకొన్నది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాల అమలుకు మండలానికో గ్రామంగా ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ విషయంలోనే అస్పష్టత నెలకొని ఆందోళన దాకా దారితీసింది. మండలానికి ఒక గ్రామంలో పైలట్ ప్రాజెక్టుగా తొలిరోజు అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించిన అదేరోజు ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
Khammam: ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం పరిధి ముదిగొండ మండలంలోని ఖానాపురం గ్రామాన్ని తొలుత ఎంపిక చేశారు ఈ మేరకు గ్రామానికి తహసీల్దార్ సునీత ఎలిజబెత్, ఎంపీడీవో శ్రీధర్ స్వామి, ఎంపీవో వాల్మీకి కిషోర్ ఆధ్వర్యంలో శనివారం సర్వే మొదలు పెట్టారు. నాలుగు పథకాలకు ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఆదివారం రోజే కొందరికి ప్రొసీడింగ్స్ అందజేస్తామని ప్రకటించారు.
Khammam: 2 గంటల పాటు ఖానాపురంలో సర్వే చేశారు. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది కసరత్తు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో రాత్రి 9 గంటల సమయంలో పలట్ గ్రామంగా ఖానాపురం గ్రామానికి బదులు సువర్ణపురాన్ని ఎంపిక చేసినట్టు సమాచారం అందింది. దీంతో అధికారులు, సిబ్బంది బయటకు వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు.
Khammam: ఈ విషయం ఆనాటా, ఈనోటా గ్రామస్థులకు తెలియడంతో పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. అధికారులు, సిబ్బందిని కార్యాలయం లోపలే ఉంచి తాళం వేసి బయట నిరసనకు దిగారు. తొలుత తమ గ్రామాన్ని ఎంపిక చేసి ఎలా మారుస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామాన్నే పైలట్ గ్రామంగా ఎంపిక చేయాలంటూ నినాదాలు చేశారు.