Kalvakuntla Kavitha: తెలంగాణ రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమి తర్వాత కవిత ఆరంభించిన దూకుడు, ఆమె వ్యాఖ్యలు సొంత పార్టీ నేతలనే తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
పార్టీ ఓటమిపై కవిత వేసిన ‘బాణాలు’
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాల రోజున ‘కర్మ ఎవర్ని వదలదు’ అంటూ కవిత చేసిన ట్వీట్ సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఆమె నేరుగా పార్టీలో కీలక నేతలైన కేటీఆర్, హరీష్ రావులను లక్ష్యంగా చేసుకున్నారు. పార్టీ ఓటమి వెనుక హరీష్ రావు ‘తెరవెనుక కుట్రలు’ ఉన్నాయని ఆమె బహిరంగంగా ఆరోపించారు.
కేటీఆర్ సోషల్ మీడియా ప్రపంచం నుంచి బయటకు వచ్చి, క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. అంతేకాకుండా, కేసీఆర్ వద్ద కేటీఆర్, హరీష్ రావు మాత్రమే పార్టీని మోస్తున్నట్లు ‘బిల్డప్’ ఇస్తున్నారని, ఆయన ముందు మిగతా వారంతా ‘పిల్లబచ్చాలే’ అంటూ తీవ్రమైన పంచ్ వేయడం బీఆర్‌ఎస్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది.
కొరివి దెయ్యం.. తిన్నింటి వాసాలు!
కవిత వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మెదక్ జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ నేతలు కవితపై ఎదురుదాడికి దిగారు. కవిత ‘తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్నారని’, ఆమె పార్టీకి ‘కొరివి దెయ్యంలా దాపురించిందని’ ఘాటైన కౌంటర్లు ఇచ్చారు.
అయితే, ఈ విమర్శలను ఏమాత్రం పట్టించుకోకుండా కవిత మరింత దూకుడు పెంచారు. తాను ప్రజల్లోకి వెళ్లి వారి బాధలు వింటున్నానని, ఆ ప్రజలు చెప్పిందే తాను మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు.
హరీష్ రావు, గంగులకు క్లారిటీ కావాలి
తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనుక ఉండి నడిపిస్తున్నాననే ప్రచారాన్ని కవిత ఖండించారు. తాను ఏసీ రూముల్లో కూర్చొని మాట్లాడే వ్యక్తిని కాదన్నారు. ఎమ్మెల్సీ నవీన్ కుమార్ కొన్ని అంశాలపై క్లారిఫికేషన్ ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేసిన కవిత… హరీష్ రావు, గంగుల కమలాకర్ కూడా తమ బాధ్యతలకు సంబంధించిన అంశాలపై ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నక్కల గండి ప్రాజెక్టుపై జాగృతి చేసిన డిమాండ్‌కు సీఎం రేవంత్ సర్కారు తలొగ్గిందని పేర్కొంటూ… గత ప్రజాప్రతినిధులు వివరణ ఇవ్వాలి తప్ప, తనపై ఎదురుదాడి చేయడం సరికాదని మండిపడ్డారు.
రేవంత్‌కు సాయం చేస్తుంది బీఆర్‌ఎస్ నేతలే!
రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌లో జరుగుతున్న పరిణామాలను సీఎం రేవంత్ రెడ్డి తనకు అనుకూలంగా వాడుకుంటున్నారని కవిత వ్యాఖ్యానించారు. మరో సంచలన అంశాన్ని లేవనెత్తుతూ… బీఆర్‌ఎస్ మీద సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడేందుకు అవకాశం ఇచ్చింది కూడా కొంతమంది బీఆర్‌ఎస్ నేతలే అంటూ సంచలన ఆరోపణ చేశారు.
ఇక, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తన పాత్ర కేవలం ‘ప్రేక్షకుడిది’ మాత్రమేనని కవిత చేసిన వ్యాఖ్య, ఎన్నికల్లో ఏదో ఒక ‘నాటకం’ నడిచిందనే అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
మహిళా న్యాయంపై ప్రశ్నలు
పార్టీల తీరుపై మాట్లాడిన కవిత, ఏ రాజకీయ పార్టీ కూడా మహిళలకు న్యాయం చేయడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలోనూ మహిళా మంత్రులు, కీలక నేతలు వివాదాంశాలతో వార్తల్లో ఉంటున్నారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీని పక్కనపెట్టి ప్రియాంక గాంధీకి న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఎలా మాట్లాడతారని ఆమె ప్రశ్నించారు.
సమస్తం పరిశీలిస్తే, బీఆర్‌ఎస్‌లో కవిత మొదలుపెట్టిన ఈ అంతర్గత పోరాటం… హరీష్ రావు, కేటీఆర్ వర్గాల మధ్య వైరాన్ని పెంచడమే కాకుండా, పార్టీ పతనానికి కారణం అవుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

