New Year 2025: న్యూ ఇయర్ వేడుకల మధ్య ఇంటర్ విద్యార్థుల సేవా స్ఫూర్తి!

అంతా కొత్త సంవత్సరం హడావుడిలో ఉన్నారు. పాత సంవత్సరం ఇచ్చిన మధురానుభూతులు.. తీసుకువచ్చిన విషాదాలు.. అందించిన సంతోష సంరంభాలు అన్నిటినీ నెమరు వేసుకుంటూ.. కొత్త సంవత్సరం పై కోటి ఆశలతో ప్రజలంతా సంబరాలు మొదలు పెట్టేశారు. క్లబ్బుల్ల్లో చిందులు వేసేవారు కొందరు.. [పబ్బుల్లో పరవశించిపోయేవారు మరికొందరు., బార్లలో టేబుల్ చుట్టూ దుకాణం పెట్టేసేవారు ఇంకొందరు. టీవీల్లో కార్యక్రమాలు చూస్తూ ఇంటిలో చుట్టుపక్కల వారితో కలిసి ఎంజాయ్ చేసే మహిళామణులు.. పిల్లలు.. పెద్దలు. ఇలా దేశవ్యాప్తంగా ఎటు చూసినా కొత్త సంవత్సర సంబరాలే.

ఇక హైదరాబాద్ లో అయితే చెప్పక్కర్లేదు. కొత్త సంవత్సరం కోసం అందరూ తమ తమ ఏర్పాట్లలో బిజీ అయిపోయారు. ఇక కుర్రకారు హంగామా అయితే మరో లెవెల్ లో ఉంది. మెజార్టీ కుర్రాళ్ళు ఫ్రెండ్స్ తో కలిసి పార్టీల హడావుడిలో మునిగిపోయారు. వీరందరి మధ్య కొంత మంది కుర్రాళ్ళు గాంధీ హాస్పటల్ వద్ద చాలా బిజీగా కనిపించారు. ఏమి చేస్తున్నారా అని చూస్తే.. వేడి వేడి ఇడ్లీలు.. కనిపిస్తున్నాయి. చుట్టూ జనం. కుర్రాళ్ళు ప్లేట్లలో పెట్టి ఇస్తుంటే తీసుకుని సంతోషంగా తింటున్నారు. అందరూ వేడివేడిగా ఉన్న టిఫిన్ తింటూ ఆ కుర్రాళ్లను చల్లగా ఉండాలని అనడం వినిపించింది.

ఇంతకీ ఏమిటిదంతా అని అక్కడ టిఫిన్స్ పెడుతున్న కుర్రాడిని అడిగితే హ్యాపీ ఞన్యూ యియర్ అని చెప్పాడు. అదేంటి అంటే.. అవునండి.. మనమంతా న్యూ యియర్ అంటూ కేకులు తిని.. అందరితో ఎంజాయ్ చేస్తాం. మరి వీళ్లకు కనీసం తిండి కూడా ఉండదు కదాండీ. అందుకని.. అంటూ చెప్పాడు. తాను ఇంటర్మీడియేట్ చదువుతున్నాడు. పేరు పృథ్వీ నర్సింహా. ప్రతి సంవత్సరం న్యూ యియర్ ఈవెంట్ సమయంలో ఇలా తమ పాకెట్ మనీతో ఆ ప్రాంతంలో ఉన్నవారికి టిఫిన్స్ ఇస్తామని చెప్పాడు. తాను తన స్నేహితులు కలిసి ఇలా న్యూ యియర్ మాత్రమే కాదు.. తమ పుట్టినరోజులు.. ప్రత్యేకమైన రోజులలో ఇలానే సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పాడు. తమకు ఇది చాలా సంతోషాన్నిస్తుంది అన్నాడు.

అవకాశం దొరకాలే కానీ, సినిమాలు.. షికార్లు.. ఇంకాస్త ముందుకెళ్లి చెడు అలవాట్ల వైపు పరుగులు తీసే యువతరం మధ్యలో తమ పాకెట్ మనీతో ఇలా సామాజిక సేవా కార్యక్రమాలను చేయాలని ఆలోచన వచ్చి.. దానిని ఆచరణలోకి తీసుకువచ్చిన ఆ యువకులను చూసి ముచ్చటేసి.. కొంతమందికైనా వారు చేస్తున్న పని స్ఫూర్తిదాయకమైనదిగా నిలుస్తుందని భావిస్తూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇదిగో ఇక్కడ పృథ్వి.. అతని స్నేహితులు చేసిన కార్యక్రమం వీడియో.

ALSO READ  Removal of Tree: వ్యాపారానికి అడ్డుందని..చెట్టుపై గొడ్డలి దెబ్బ.. నేలకూలిన 50ఏళ్ల వృక్షరాజం !

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *