IndiGo: దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు విమానయాన సంస్థ అయిన ఇండిగో (IndiGo) సర్వీసుల్లో గత కొన్ని రోజులుగా నెలకొన్న తీవ్ర అంతరాయంపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. వందలాది విమానాల రద్దులు, జాప్యాల కారణంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇండిగో కార్యకలాపాల్లో వైఫల్యం, సరైన ప్రణాళిక, పర్యవేక్షణ లోపాలు ఉన్నాయని ఈ నోటీసులో డీజీసీఏ స్పష్టం చేసింది. సీఈవోగా సమర్థవంతమైన నిర్వహణ బాధ్యత మీపై ఉన్నప్పటికీ, ప్రయాణీకులకు సౌకర్యాలు కల్పించడంలో మీరు విఫలమయ్యారని పేర్కొంది. దీనికి సంబంధించి 24 గంటల్లో వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో శిక్షాత్మక చర్యలు తీసుకుంటామని డీజీసీఏ హెచ్చరించింది.
Also Read: Nikhita Nagdev: న్యాయం చేయండి మోదీ జీ: పాక్ మహిళ విజ్ఞప్తి
సిబ్బంది కొరత, విమాన డ్యూటీ సమయ పరిమితుల (FDTL) పథకాన్ని సరిగా అమలు చేయకపోవడమే ఈ అంతరాయాలకు ప్రధాన కారణమని నియంత్రణ సంస్థ స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు, ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్‌తో అత్యవసర సమావేశం నిర్వహించి ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు. విమాన కార్యకలాపాలను త్వరగా సాధారణ స్థితికి పునరుద్ధరించడమే తక్షణ ప్రాధాన్యమని మంత్రి ఆదేశించారు. అలాగే, రద్దయిన విమానాలకు సంబంధించిన టికెట్ డబ్బులను ప్రయాణీకులకు వెంటనే తిరిగి చెల్లించేలా చూడాలని సంస్థను ఆదేశించారు. అసౌకర్యానికి గురైన ప్రయాణీకులకు హోటల్ వసతితో పాటు తక్షణ డబ్బు చెల్లింపులు చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ సంక్షోభంపై లోతుగా దర్యాప్తు చేసేందుకు డీజీసీఏ ఇప్పటికే నలుగురు సభ్యులతో కూడిన ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ అంతరాయం కారణంగా శుక్రవారం 1600 విమానాలు, శనివారం 800 విమానాలు రద్దవడంతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

