UP: ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భార్యతో గొడవల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన ఒక వ్యక్తి తన ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి విషం సేవించగా, ముగ్గురూ మరణించారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. మృతుడిని బాబూరామ్ గా గుర్తించారు. కొంతకాలంగా బాబూరామ్‌కు, అతని భార్యకు మధ్య మనస్పర్థలు, గొడవలు జరుగుతున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. భార్య పుట్టింట్లో ఉండగా, శుక్రవారం తన సోదరుడి పెళ్లి వేడుకకు హాజరైన తర్వాత తిరిగి గ్రామానికి వచ్చింది. ఆమె తిరిగి వచ్చిన వెంటనే దంపతుల మధ్య మళ్లీ గొడవలు చెలరేగినట్లు సమాచారం. శనివారం, బాబూరామ్ పిల్లలకు హెయిర్‌కట్ చేయిస్తానని చెప్పి వారిని ఇంటి నుండి తీసుకువెళ్లాడు.
Also Read: Virat Kohli: విశాఖలో సింహాద్రి అప్పన్న దర్శించుకున్న విరాట్ కోహ్లి
ఆ తరువాత కొద్దిసేపటికే ఇద్దరు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మరణించారు. బాబూరామ్ పరిస్థితి కూడా విషమించడంతో, స్థానికులు అతడిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో బాబూరామ్ మరణించాడు. వీరు ముగ్గురూ విషపూరిత పదార్థం సేవించారని వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. బాబూరామ్ భార్యే పిల్లలను, అతడిని విషం సేవించమని బలవంతం చేసి ఉండవచ్చని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలను పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. ఈ ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఘటన జరిగిన వెంటనే సీఓ చాంద్‌పూర్ దేశ్ దీపక్ సంఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఎస్పీ రూరల్ డా. ప్రకాష్ సింగ్ కూడా గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. పిల్లల మృతదేహాలను అంత్యక్రియల కోసం బంధువులు తీసుకువెళ్లగా, బాబూరామ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పంపినట్లు పోలీసులు తెలిపారు. ఎస్పీ రూరల్ డా. ప్రకాష్ సింగ్ మాట్లాడుతూ.. ఈ ఘటన కుటుంబ వివాదం కారణంగానే జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నామని చెప్పారు. పోస్ట్‌మార్టం నివేదిక అందిన తర్వాత తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తులో భాగంగా బాబూరామ్ భార్యను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

