Rain Alert: ‘దిత్వా’ తుఫాను వేగం పెంచుకుని, సముద్ర తీరం వెంబడి ముందుకు సాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరితో పాటు దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలకు భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా రాయలసీమ మరియు కోస్తాంధ్ర జిల్లాల్లో బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ తుఫాన్ చెన్నైకి దగ్గరలో సముద్రంలోనే బలహీనపడే అవకాశం ఉన్నప్పటికీ, ముందు జాగ్రత్తగా అధికారులు అప్రమత్తమయ్యారు.
తిరుపతి జిల్లాకు భారీ వర్ష సూచన – స్కూళ్లకు సెలవు
దిత్వా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో, తిరుపతి జిల్లా యంత్రాంగం వెంటనే చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ముఖ్య ప్రకటన విడుదల చేశారు. ఈ రోజు తిరుపతి జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అంతేకాకుండా, ప్రజల సమస్యలు వినేందుకు నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని కూడా రద్దు చేశారు. దిత్వా తుఫాను కారణంగా సహాయక చర్యల్లో అధికారులు పూర్తిగా నిమగ్నమై ఉన్నందున, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు జిల్లా, మండల కేంద్రాలకు వెళ్లవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
పోలీసులు, అధికారుల కీలక సూచనలు – జాగ్రత్తగా ఉండండి!
తుఫాను ప్రభావం ఉన్న ప్రాంతాల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. ప్రజలందరూ వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. ముఖ్యంగా, వాగులు, వంకలు, చెరువులు, డ్యామ్‌లు దగ్గరకు వెళ్లవద్దని, నీటి ప్రవాహం ఉన్న చోట వాటిని దాటే ప్రయత్నం అస్సలు చేయవద్దని హెచ్చరించారు. రాత్రి సమయాల్లో ప్రయాణాలు చేయకపోవడం మంచిది. భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయే అవకాశం ఉంది కాబట్టి, అలాంటి ప్రాంతాలకు దూరంగా ఉండాలి. ప్రమాదాలు జరిగే చోట నిలబడి సెల్ఫీలు, వీడియోలు తీయడం పూర్తిగా నిషేధమని ఎస్పీ స్పష్టం చేశారు.
ప్రజల భద్రత కోసం పోలీసులు, ఫైర్ సర్వీసులు, 108 అంబులెన్స్‌తో పాటు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
అత్యవసర సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లు
తుఫాను కారణంగా ఎక్కడైనా ప్రమాదం జరిగినా, ఎవరికైనా అత్యవసర సహాయం అవసరమైనా, వెంటనే కింది నంబర్లను సంప్రదించాలని అధికారులు కోరారు:
* తిరుపతి జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్: 80999 99977
* ఎమర్జెన్సీ నంబర్: 112
* తిరుపతి జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్: 0877-2236007

