Hyderabad News:హైదరాబాద్ వనస్థలిపురంలోని కమ్మగూడెంలో ఓ భూ వివాదం సినీ ఫక్కీలో జరిగింది. ఇరువర్గాల పరస్పర దాడులతో రణరంగంగా మారింది. ఏకంగా కొందరి వాహనాలను దహనం చేయడంతోపాటు ఓ బస్సును ధ్వంసం చేసిన ఘటన చోటుచేసుకున్నది. దీనిపై పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను సముదాయించి గొడవను సద్దుమణిగేలా చొరవ తీసుకున్నారు.
Hyderabad News:కమ్మగూడ సర్వేనంబర్ 240లోని 10 ఎకరాల భూమి విషయంలో గత కొన్నాళ్లుగా వివాదం కొనసాగుతున్నది. తాము 20 ఏండ్ల క్రితమే అక్కడి ప్లాట్లు కొన్నామని, కొందరు ఆ ప్లాట్లలో ఇండ్లను నిర్మించుకొని ఉంటున్నామని స్థానికులు చెప్తున్నారు. అయితే ఆ భూమి తమదంటూ మరికొందరు ఆ స్థలాలపైకి వస్తున్నారు. ఈ దశలో ప్లాట్లు కొన్నవారికి, ఆ భూమి తమదే అంటున్న వారికి గత కొన్నాళ్లుగా వివాదం నడుస్తున్నది.
Hyderabad News:ఉన్నట్టుండి ఈ రోజు (ఏప్రిల్ 9) నగరంలోని మెహదీపట్నం నుంచి ఓ ప్రైవేటు బస్సులో పెద్ద ఎత్తున మహిళలు, బైక్‌లపై పురుషులు వచ్చి ప్లాట్ల యజమానులను బెదిరించసాగారు. దీంతో అక్కడి ప్లాట్ల యాజమానులు, వారి కుటుంబ సభ్యులు ఏకమై మెహదీపట్నం నుంచి వచ్చిన మహిళలను, పురుషులతో ఘర్షణకు దిగారు. మహిళలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సమయంలో మహిళల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొన్నది. అక్కడి నుంచి వారిని తరిమివేశారు. ఈ సమయంలో ఇరువర్గాల నడుమ ఘర్షణ చోటుచేసుకున్నది. వారు వచ్చిన బైక్‌లను దహనం చేశారు. మహిళలు వచ్చిన బస్సు అద్దాలను ధ్వంసం చేశారు.
Hyderabad News:దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకోవడం పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరువర్గాలను శాంతింపచేశారు. 20 ఏండ్ల క్రితమే తాము ఆ ప్లాట్లను కొనుగోలు చేశామని, ఇప్పుడొచ్చి తమను బెదిరిస్తున్నారని, తమకు న్యాయం చేయాలని ప్లాట్ల యాజమానులు పోలీసులను కోరారు. ఏదేమైనా కోర్టుల్లో, కేసుల ద్వారా పరిష్కరించుకోవాల్సిన ఇలాంటి వివాదాలను భౌతిక దాడులకు దిగడం సమర్థనీయం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

