Hyderabad: అనారోగ్యంతో మరణించిన కుటుంబ సభ్యుడికి అంత్యక్రియలు చేసేందుకు ఆ ఇంటిలో చిల్లిగవ్వలేదు. దీంతో మృతదేహాన్ని ఇంటిలోనే ఉంచి, కుటుంబ సభ్యులెవరూ బయటకు వెళ్లకుండా దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఈ సమయంలో అనుమానం వచ్చిన ఆ ఇంటి యాజమాని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ ఇంటి దీనస్థితి బయటకొచ్చింది.
Hyderabad: మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన స్వామిదాస్ (76) కుటుంబం హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలోని షాపూర్‌నగర్ సమీపంలోని ఎన్ఎల్‌బీ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నది. స్వామిదాస్ చిన్న కూతురు సలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నది. స్వామిదాస్ కు వయసు మీద పడటంతోపాటు అనారోగ్యం దరిచేరింది.
Hyderabad: ఇటీవల స్వామిదాస్ ఆరోగ్యం క్షీణించింది. ఈ దశలో ఆయన కూతురు సలోని చేస్తున్న ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. స్వామిదాస్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించి మూడు రోజుల క్రితం మరణించాడు. ఈ సమయంలో ఆ ఇంటిలో చిల్లిగవ్వలేదు. కనీసం స్వామిదాస్ అంత్యక్రియల ఖర్చులు భరించే స్థోమత ఆ కుటుంబానికి లేదు. ఈ స్థితిలో ఆ మృతదేహాన్ని ఇంటిలోనే ఉంచి మూడు రోజులుగా కుమిలిపోతూ ఆ కుటుంబం ఉండసాగింది.
Hyderabad: బయటకు చెప్పుకోలేక, ఎవరినీ దేబిరించి అడగలేక దిగమింగుకుంటూ కన్నీటి సాగరంలో స్వామిదాస్ కుటుంబం మునిగిపోయింది. మూడు రోజులుగా బయటకు వెళ్లకుండా ఉన్న ఆ కుటుంబంపై ఆ ఇంటి యజమానికి అనుమానం వచ్చింది. దీంతో పోలీసులకు ఆయన సమాచారం ఇచ్చాడు. ఈ మేరకు వచ్చిన పోలీసులకు దిగాలు పడే విషయం తెలిసింది.
Hyderabad: స్వామిదాస్ మరణించిన విషయాన్ని గుర్తించిన పోలీసులు.. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఓ స్వచ్ఛంద సంస్థకు సమాచారం ఇవ్వడంతో ఆ సంస్థ సభ్యుల సహకారంతో పోలీసులు అంత్యక్రియలు జరిపించారు. రోజు గడవడమే కష్టమైన ఈ రోజుల్లో ఎందరికో ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎలా అనే ఆలోచన ప్రతి ఒక్కరికీ రాకమానదు.

