Hyderabad: మాజీ ఎమ్మెల్యే పేరును ఓటర్ లిస్ట్ నుంచి తొలగింపు

Hyderabad: తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. వేములవాడ నియోజకవర్గం నుంచి నాలుగు పర్యాయాలు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన చెన్నమనేని రమేష్ తన ఓటు హక్కును కోల్పోయారు. ఆయన భారత పౌరుడు కాదని ఇటీవల హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో అధికారులు ఆయన పేరును వేములవాడ ఓటరు జాబితా నుంచి తొలగించారు.

ఈ మేరకు ఎన్నికల అధికారులు చెన్నమనేని రమేష్ నివాసానికి నోటీసులు అంటించారు. ఆయన పౌరసత్వం చెల్లదని, అందువల్ల ఓటరుగా కొనసాగే అర్హత లేదని ఆ నోటీసులో పేర్కొన్నారు. దీనిపై చెన్నమనేని వైపు నుంచి సమాధానం రావాల్సి ఉంది. ఓటరు జాబితాలో పేరు తొలగింపుపై గతంలో అధికారులు నోటీసులు జారీ చేశారు. సమాధానం రాకపోవడంతో ఓటరు జాబితా నుంచి ఆయన పేరును తొలగించారు.

చెన్నమనేని పౌరసత్వంపై ప్రస్తుత వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సుదీర్ఘకాలంగా న్యాయపోరాటం చేసిన విషయం విదితమే. ఈ పోరాటం ఫలితంగానే హైకోర్టు తీర్పు వెలువడింది. కోర్టు తీర్పును తక్షణమే అమలు చేయాలని, ఓటరు జాబితా నుంచి చెన్నమనేని పేరును తొలగించాలని ఆది శ్రీనివాస్ అధికారులను కోరారు. ఆయన విజ్ఞప్తి మేరకు అధికారులు ఈ చర్యలు చేపట్టారు.

ఒక రాష్ట్రంలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి, పౌరసత్వ వివాదం కారణంగా ఓటు హక్కును కోల్పోవడం బహుశా దేశంలోనే ఇదే తొలిసారి అంటూ రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Weight loss: బరువు తగ్గడానికి ప్రతిరోజూ ఈ పండు తినండి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *