Hyderabad : తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా కీలక ముందడుగు పడింది. మంగళవారం దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో స్కైరూట్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, స్కైరూట్ కంపెనీ తెలంగాణలో ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్, మరియు టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు దాదాపు రూ. 500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.
ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రం అంతరిక్ష రంగంలో ఒక ముఖ్య కేంద్రంగా మారబోతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ను ప్రైవేట్ రంగ అంతరిక్ష కార్యకలాపాలకు కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులను రాష్ట్రానికి సాధించడం గర్వకారణమని సీఎం అన్నారు.
ఇప్పటికే యూనిలివర్ వంటి బహుళజాతి సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం మరో విజయంగా నిలిచింది. యూనిలివర్ కంపెనీ సీఈవో హీన్ షూమేకర్, చీఫ్ సప్లై చైన్ ఆఫీసర్ విల్లెం ఉయిజెన్‌తో సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమై కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం, కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి యూనిలివర్ కంపెనీ అంగీకరించింది.
ఈ విధంగా తెలంగాణలో పెట్టుబడుల ప్రవాహం రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతోందని నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు.