Cyclone Ditwah: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దిత్వ’ తుఫాన్ ఇప్పుడు దేశం వైపు వేగంగా కదులుతోంది. ఈ తుఫాన్ ప్రస్తుతం తమిళనాడు తీర ప్రాంతాలకు సమాంతరంగా ప్రయాణిస్తోంది. ముఖ్యంగా పుదుచ్చేరి, చెన్నై నగరాలపై దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ముందు జాగ్రత్తగా చెన్నై, పుదుచ్చేరిలో బీచ్‌లను మూసివేశారు.
తుఫాన్ గమనం – తీరం వెంబడి ప్రయాణం
గత ఆరు గంటల్లో ఈ తుఫాన్ గంటకు 5 కిలోమీటర్ల వేగంతో ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఇది కారైకల్‌కు తూర్పున 80 కిలోమీటర్లు, వేదరణ్యానికి తూర్పున 100 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 160 కిలోమీటర్లు, చెన్నైకి 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ‘దిత్వ’ తుఫాన్ ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ, త్వరలో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరికి మరింత దగ్గరగా చేరుకోనుంది.
ఆంధ్రప్రదేశ్‌కు హెచ్చరికలు – మూడు రోజులు వర్షాలే!
తుఫాన్ తీరానికి సమాంతరంగా ప్రయాణిస్తున్నప్పటికీ, దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై మూడు రోజుల పాటు ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కృష్ణపట్నం పోర్టుకు మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేయగా, మిగిలిన అన్ని పోర్టులలో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని అధికారులు గట్టిగా సూచించారు. బలమైన ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉంది.
ఏపీ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు
తుఫాన్ కారణంగా దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయి.
Also Read: Gold Price Today: బంగారం కొనేవారికి శుభవార్త.. బంగారం వెండి ధరలు.. తులం ఎంతంటే?
ఆదివారం (నవంబర్ 30):
* రెడ్ అలర్ట్: నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు.
* ఆరెంజ్ అలర్ట్: ప్రకాశం, కడప, అన్నమయ్య జిల్లాలకు.
* ఎల్లో అలర్ట్: గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు.
సోమవారం:
* ఆరెంజ్ అలర్ట్: ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు.
* ఎల్లో అలర్ట్: తూర్పు గోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు.
తెలంగాణలో చలి, అక్కడక్కడ వర్షం
‘దిత్వ’ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో కూడా కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. ఉత్తర-వాయువ్య దిశగా కదులుతున్న ఈ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అటు చలి కూడా బాగా పెరిగింది. భద్రాచలంలో అత్యధికంగా 17 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో అత్యల్పంగా 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

