Hyderabad: తెలంగాణ రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు శుభవార్త ప్రకటించారు. ఆయిల్ పామ్ పంటల గెలల ధరను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టన్ను పామాయిల్ గెలల ధరను రూ. 20,506గా నిర్ణయించినట్లు మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ పెరిగిన ధరలు జనవరి 1 నుంచి అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు.
అదే విధంగా, రైతు భరోసా పథకంపై ఇంకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు:
రూ. 21 వేల కోట్ల రుణమాఫీ, రూ. 7,625 కోట్ల రైతు బంధు, రూ. 3 వేల కోట్ల రైతు భీమా అదనంగా, సన్న ధాన్య పంటలకు బోనస్ అందించినట్లు స్పష్టం చేశారు. పంట వేసిన ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు.
కేబినెట్ సబ్ కమిటీ ప్రస్తుతం విధి విధానాలపై చర్చలు జరుపుతుందనీ, ఆ చర్చల ఫలితాలను కేబినెట్‌లో సమర్పించనున్నట్లు చెప్పారు. తుది నిర్ణయం కేబినెట్ ద్వారా మాత్రమే తీసుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావుపేర్కొన్నారు.