Tollywood 2024

Tollywood 2024: విశేషాలు… వివాదాలు… వివాహాలు… వీడ్కోలు! ఈ ఏడాది టాలీవుడ్ తీరిది!

Tollywood 2024: ఎప్పటిలానే చిత్రసీమలో 2024లో సైతం వినోదం… విషాదం… వివాదం… చెట్టపట్టాలేసుకుని తిరిగాయి. ఊహకందని వివాదాలు ఉక్కిరిబిక్కిరి చేసిన వైనం ఒక వైపు… వివాహవేడుకల్లో తలమునకలైన సంఘటనలు మరోవైపు. బోలెడు విశేషాలు… అలానే మరెన్నో విషాదాలు… వెరసి ఈ యేడాది కాలం ఏడు రంగుల ఇంద్రధనస్సును తలపించింది!! సినిమా ప్రపంచం ఈ ఏడాది ప్రజలకు సూపర్ థ్రిల్లింగ్ నిజంగానే సినిమా చూపించింది. 

2024లో టాలీవుడ్ విశేషాలు.. 

సినిమా రంగంలో విశేషాలకు ఈ యేడాది కొదవలేదు. మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకుంటే… ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ ఏకంగా ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు… ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలంగాణ ఎఫ్.డి.సి. ఛైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇవన్నీ సినిమా రంగంలో జోష్ ను నింపాయి.

మెగాస్టార్ చిరంజీవికి పురస్కారాలు కొత్తకాదు… ఇప్పటికే పద్మభూషణ్ అందుకున్న ఆయన్ని కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ కు ఎంపిక చేసినట్టు జనవరి 25న ప్రకటించింది. మిధున్ చక్రవర్తి, గాయని ఉషా ఉతప్, ప్యారేలార్, దత్తాత్రేయ అంబదాస్, స్వర్గీయ విజయ్ కాంత్ ను పద్మభూషణ్ కు ఎంపిక చేశారు. వీరంతా మే 9న ఈ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు.

ఫిబ్రవరి మాసం టాలీవుడ్ ప్రముఖులకు ఊరటనిచ్చింది. సినీ తారలపై పెట్టిన 12 కేసుల్లో ఆరింటిని కొట్టేశారు. ఎన్.డి.పి.ఎస్. ప్రొసీజర్స్ ను ఎక్సైజ్ అధికారులు పాటించలేదనే కారణంగానూ, ఫోరెన్సిక్ లాబొరేటరీ రిపోర్ట్ లో సెలబ్రిటీస్ డ్రగ్స్ తీసుకున్న ఆనవాళ్ళు లేని కారణంగా రవితేజ, పూరి జగన్నాథ్, తరుణ్ తో పాటు మిగిలిన వారి మీద కేసులు కొట్టేశారు. ఫిబ్రవరి 2న ప్రముఖ తమిళనటుడు విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’పేరుతో రాజకీయ పార్టీ పెడుతున్నట్టు ప్రకటించాడు. అంతేకాదు… దీనికి సంబంధించిన గ్రాండ్ పబ్లిక్ మీటింగ్ ను అక్టోబర్ 27న నిర్వహించాడు.

పద్మ అవార్డు గ్రహీతలను తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 4న  సత్కరించింది. అదే నెల 5న 2024కి గానూ ఐదుగురు భారతీయ కళాకారులు, గాయకులు గ్రామీ అవార్డులను గెలుచుకున్నారు. తబలా కళాకారులు జాకీర్ హుస్సేన్, వేణుగాన  విద్వాంసులు రాకేశ్ చౌరాసియా, గాయకుడు శంకర్ మహదేవన్, వయోలిన్ కళాకారుడు గణేశ్ రాజగోపాలన్, డ్రమ్స్ కళాకారుడు సెల్వ గణేశ్ వినాయక్ రామ్ అవార్డులను పొందారు. ఫిబ్రవరి 10న మురళీమోహన్ నట స్వర్ణోత్సవం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో మహా టీవీ సాక్షిగా ఘనంగా జరిగింది. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.

ఫిబ్రవరి 11న జరిగిన తెలుగు దర్శకుల సంఘం అధ్యక్ష ఎన్నికల్లో వీరశంకర్, అతని ప్యానల్ ఘన విజయాన్ని సాధించింది. ప్రముఖ రచయిత గుల్జార్ ను కేంద్రం జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపిక చేసింది. సినీ పాత్రికేయుడు, నేపధ్య గాయకుడు, భగవద్గీత ఫౌండేషన్ ఛైర్మన్ ఎల్. గంగాధర శాస్త్రి సంగీత నాటక అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. మార్చి 1న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ అట్టహాసంగా మొదలైంది. ఏడవ తేదీ ప్రఖ్యాత గాయని పి. సుశీలకు తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అందించింది. మార్చి 28న దుబాయ్ లోని మేడమ్ తుస్సాద్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు ప్రతిమను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ పాల్గొన్నాడు. ఏప్రిల్ 13న రామ్ చరణ్ కు చెన్నయ్ లోని వేల్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. మే 19న హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో డైరెక్టర్స్ డే ను ఘనంగా జరిపారు. జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్ ను ఈ సందర్భంగా సత్కరించారు. 

జూన్ 12న ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ లో ఏర్పడిన నూతన ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత 19న ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష్య, ఉపాధ్యక్ష పదవులకు మదన్ మోహన్, అశోక్ కుమార్ ఎన్నికయ్యారు. ఆగస్ట్ 16న ప్రకటించిన జాతీయ చలన చిత్ర అవార్డులలో తెలుగు సినిమాకు ఈసారి చుక్కెదురైంది. ‘కార్తికేయ -2’ చిత్రం ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా అవార్డుకు ఎంపికైంది. అక్టోబర్ 8న ఈ అవార్డును చిత్ర బృందం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకుంది. 

ఆగస్ట్ లో ఇద్దరు అగ్ర కథానాయకులు గాయాల బారిన పడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ జిమ్ లో వర్కౌట్స్ చేస్తుండగా చెయ్యి బెణికింది. దాంతో రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకున్నారు. అలానే రవితేజ కు షూటింగ్ లో గాయం కావడంతో చేతికి శస్త్ర చికిత్స జరిగింది. గద్దర్ అవార్డు విధి విధానాలపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్టస్ 22న ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ‘దాసి’నరసింగరావు అధ్యక్షులుగా, ‘దిల్’రాజు ఉపాధ్యక్షులుగా ఓ కమిటీని వేసింది. తెలుగు ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి పదవికి జరిగిన ఎన్నికల్లో అమ్మిరాజు కానుమిల్లి విజయం సాధించారు. సెప్టెంబర్ మాసంలో సినీ జనం తమ పెద్ద మనసును చాటుకున్నారు. రెండు రాష్ట్రాలలో జరిగిన వరద బాధితులను ఆదుకోవడానికి అంత భారీ ఎత్తున విరాళాలను అందించారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా సెప్టెంబర్ 10 ప్రతాని రామకృష్ణ గౌడ్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సెప్టెంబర్ 20న అక్కినేని శత జయంతి ముగింపు ఉత్సవం సందర్భంగా చిరంజీవికి అక్కినేని నేషనల్ అవార్డు ఇవ్వబోతున్నట్టు నాగార్జున ప్రకటించారు. అలానే దీనిని అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా అక్టోబర్ 28న అందచేశారు.

మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు. 156 సినిమాలలో 537 పాటల్లో, 24 వేల డాన్స్ మూమెంట్స్ చేసినందుకు ఆయనకు ఈ అవార్డు లభించింది. సెప్టెంబర్ 22న ఆమీర్ ఖాన్ చేతుల మీదుగా దీనిని చిరు అందుకున్నారు. అలానే 27న అబూదబీలో చిరంజీవిని ఐఫా ఔట్ స్టాండింగ్ అఛీవ్ మెంట్ ఆన్ ఇండియన్ సినిమా అవార్డుతో ఘనంగా సత్కరించింది. ఇండియా నుండి ఆస్కార్ ఎంట్రీకి ‘లా పతా లేడీస్’ను కమిటీఎంపిక చేసింది కానీ… ఆ తర్వాత జరిగిన స్క్రుటినీలో ఇది ఎంపిక కాలేదు. సెప్టెంబర్ 25న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్థంతి సందర్భంగా చెన్నయ్ లో ఆయన నివసిస్తున్న వీధికి ఎస్.బి.పి. పేరు పెడుతూ ముఖ్యమంత్రి స్టాలిన్ ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్ 29న ఎఫ్.ఎన్.సి.సి.కి జరిగిన ఎన్నికల్లో కె.ఎస్. రామారావు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇదే  నెల 30న నటుడు మిధున్ చక్రవర్తిని దాదాసాహేబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక చేసినట్టు కేంద్ర ప్రకటించింది. తొలి చిత్రం ‘మృగయ’ తోనే ఆయన ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకోవడం విశేషం.

అక్టోబర్ 2న గాయని సుశీలను సీఎం స్టాలిన్ ‘కలైజ్ఞర్ నినైవు కలైతురై విత్తగర్’అవార్డుతో సత్కరించి పది లక్షల చెక్కును అందించారు. భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకున్న కథానాయకుడిగా అల్లు అర్జున్ ను ఫోర్బ్స్ ఇండియా మేగజైన్ ప్రకటించింది. ‘పుష్ప-2’ కు ఆయన 300 కోట్లు తీసుకున్నట్టు తెలిపింది. తెలుగు డాన్స్ మాస్టర్స్ అండ్ డాన్సర్స్ యూనియన్ కు జరిగిన ఎన్నికల్లో జోసెఫ్ ప్రకాశ్ గెలిచారు. బిగ్ బాస్ సీజన్ 8 విజేత బుల్లితెర నటుడు నిఖిల్ విజయం సాధించాడు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా దిల్ రాజు డిసెంబర్ 18న బాధ్యతలు స్వీకరించారు. ఎఫ్.డి.సి. నేతృత్వంలో సినీ ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా ఖ్యాతి నిలిచేలా కృషి చేయాలని ఆయన కోరారు. దేశంలోనే అతి పెద్దదయిన కౌటౌట్ ను నిర్మాత దిల్ రాజు విజయవాడలో డిసెంబర్ 29న ఆవిష్కరించారు. ‘గేమ్ ఛేంజర్ కోసం 256 అడుగుల రామ్ చరణ్ కటౌట్ ను నగరం నడిబొడ్డున నిలబెట్టారు. 

వివాహాల సందడి.. 

చిత్రసీమలో ఈ యేడాది పెళ్ళిళ్ళ సందడి మామూలుగా లేదు… అలానే గతంలో వివాహం చేసుకున్న కొందరు పేరెంట్స్ హోదాను పొందారు. బాధాకరం ఏమంటే… స్టార్ హీరోలు, మ్యూజిక్ డైరెక్టర్స్ తమ బెటర్ హాఫ్ లకు విడాకులు ఇస్తున్నట్టు ప్రకటనలు చేశారు.

ఈ యేడాది పెళ్ళి పల్లకిలో ఊరేగిన వారు చాలా మందే ఉన్నారు. కొందరికి ఇదే తొలి వివాహం కాగా, మరికొందరు పాత బంధాలకు స్వస్తి చెప్పి కొత్త సంబంధాలను కలుపుకున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు, హీరో ఆశిష్ రెడ్డి పెళ్ళి విజయవాడకు  చెందిన ఆద్వితారెడ్డితో ఫిబ్రవరి 14న జరిగింది. ‘జాదుగాడు, స్పీడున్నోడు, ఈడోరకం ఆడోరకం’మూవీస్ హీరోయిన్ సోనారికా బధోరియా పెళ్ళి వికాస్ పరాశర్ తో రాజస్థాన్ లో జరిగింది. ‘టైగర్ నాగేశ్వరరావు, ఎక్స్ టార్డినరీ మ్యాన్’చిత్రాలలో నటించిన మలయాళ నటుడు సుదేవ్ నాయర్ పెళ్ళి అమర్ దీప్ కౌర్ తో జరిగింది. ఫిబ్రవరి 21న ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ మెడలో బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ మూడు ముళ్ళు వేశాడు. అదే నెల 26న ‘యువత, కందిరీగ’ చిత్రాల కథానాయిక అక్ష పర్దాసానీ వివాహం కౌశల్ తో జరిగింది.

ALSO READ  Mohan babu: మోహన్ బాబును విచారిస్తున్న పోలీసులు

తెలుగుతో పాటు పలు హిందీ చిత్రాలలో నటించిన కృతి కర్బందా వివాహం నటుడు పులకిత్ సమ్రాట్ తో మార్చి 15న జరిగింది. ఇదే నెల 24న తమిళ నటి, కమెడియన్ ‘రోబో’ శంకర్ కుమార్తె ఇంద్రజా శంకర్ వివాహం దర్శకుడు కార్తీక్ తో జరిగింది. నటి తాప్సీ పెళ్ళి మార్చి 25న మాధియాస్ బో తో జరిగింది. చిత్రం ఏమంటే… తమ పెళ్ళి నిజానికి గత యేడాదే జరిగిందంటూ తాప్సీ ఆ తర్వాత కొద్ది నెలలకు తెలిపింది. ఏప్రిల్ 15న ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె, గాయని ఐశ్వర్య వివాహం అసిస్టెంట్ డైరెక్టర్ తరుణ్ కార్తికేయతో జరిగింది. తెలుగులో పలు చిత్రాలలో నటించి హీరోగా తన అదృష్టం పరీక్షించుకుంటున్న తిరువీర్ పెళ్ళి కల్పనా రావుతో తిరుమలలో జరిగింది. 

జూన్ 10న సీనియర్ నటుడు అర్జున్ సర్జా కుమార్తె, నటి ఐశ్వర్య వివాహం దర్శకుడు ఉమాపతితో అయ్యింది. జూన్ 23న సీనియర్ నటుడు శతృఘ్న సిన్హా కుమార్తె, హీరోయిన్ సోనాక్షి సిన్హా వివాహం జహీర్ తో జరిగింది. ‘జై బోలో తెలంగాణ, హితుడు’చిత్రాల నాయిక, మలయాళీ నటి మీరానందన్ పెళ్ళి శ్రీజుతో అయ్యింది. ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ – నికొలోయ్ సచిదేవ్ వివాహాని కంటే ముందు వెడ్డింగ్ రిసెప్షన్ ను చెన్నయ్ లో జూలై 3న గ్రాండ్ గా నిర్వహించారు. ఆ తర్వాత 10వ తేదీన వారి పెళ్ళి థాయ్ లాండ్ లో జరిగింది. ఆగస్ట్ 22న ‘రాజావారు – రాణి గారు’చిత్ర హీరోహీరోయిన్లు కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్  సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. 

ఆగస్ట్ 25న ప్రముఖ నటి అమీజాక్సన్ వివాహం హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్ లిక్ తో ఇటలీలో జరిగింది. ఇక ‘టైగర్ నాగేశ్వరావు’తో పాటు ‘’దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, మిసెస్ సుబ్బలక్ష్మీ’చిత్రాలు రూపొందించిన దర్శకుడు వంశీకష్ణ ఆగస్ట్ 28న ప్రమీల ను పెళ్ళాడారు. సెప్టెంబర్ 15వ తేదీ హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితిరావ్ హైదరీ పెళ్ళి వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపురంలో ఉన్న రంగనాయక స్వామి ఆలయంలో జరిగింది. గతంలో వీరిద్దరూ కలిసి ‘మహా సముద్రం’ లో నటించారు. ఇదే నెలలో నటి మేఘా ఆకాశ్ మెడలో ఆమె స్నేహితుడు సాయి విష్ణు మూడు ముడులు వేశాడు. వీరి వెడ్డింగ్ రిసెప్షన్ కు తమిళనాడు సీఎం స్టాలిన్ హాజరయ్యారు.

నవంబర్ 9న ఆర్జీవీ మేనకోడలు, ఫిల్మ్ స్టైలిస్ట్ శ్రావ్య వర్మ క్రీడాకారుడు కిడంబి శ్రీకాంత్ ను పెళ్ళాడింది. అదే నెల 11న దర్శకుడు క్రిష్… డాక్టర్ ప్రీతి చల్లా మెడలో మూడు ముళ్ళు వేశారు. 16న గాయనీ గాయకులు రమ్యా బెహర, అనురాగ్ కులకర్ణి ఏడు అడుగులు నడిచారు. 17వ తేదీ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు, హీరో శ్రీసింహా – మురళీమోహన్ మనవరాలు రాగ వెడ్డింగ్ రిసెప్షన్ గోల్కొండ రిసార్ట్స్ లో జరిగింది. నవంబర్ 26న నటుడు సుబ్బరాజు అమెరికాలో స్రవంతి ని వివాహమాడారు. డిసెంబర్ లో పలువురు టాప్ హీరోస్, హీరోయిస్ ఒక్కటయ్యారు. 5వ తేదీ నాగచైతన్య, శోభితా పెళ్ళి అన్నపూర్ణ స్టూడియోలో జరగగా, నటుడు, దర్శక, రచయిత సందీప్ రాజ్ వివాహం.. నటి చాందని రావ్ తో తిరుమలలో జరిగింది. అలానే 9వ తేదీ నటుడు సాయికిరణ్ పెళ్ళి నటి స్రవంతితో జరిగింది. డిసెంబర్ 12న జాతీయ ఉత్తమనటి కీర్తి సురేశ్ పెళ్ళి ఆమె బోయ్ ఫ్రెండ్ ఆంటోనీతో గోవాలో గ్రాండ్ గా జరిగింది. ఇక బిగ్ బాస్ ఫేమ్, నటి ఆకుల సోనియా పెళ్ళి 21న యశ్ పాల్ వీరగోనితో అయ్యింది. 

ఈ యేడాది పెళ్ళిపీటలు ఎక్కకపోయినా… పలువురు వివాహ నిశ్చితార్థాలు జరుపుకున్నారు. జనవరి 1న మలయాళ నటుడు షైన్ టామ్ చాకో వివాహ నిశ్చితార్థం స్నేహితురాలు, ఫ్యాషన్ మోడల్ తనూజతో జరిగింది. గతంలో ఆయన బబితను వివాహం చేసుకున్నారు. ఆ పైన విడాకులు ఇచ్చారు. షైన్ టామ్ చాకో తెలుగులో ‘దసరా, దేవర’చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 13న నారా రోహిత్ వివాహ నిశ్చితార్థం ‘ప్రతినిధి -2’లో నటించిన హీరోయిన్ శిరీష లేల్లతో జరిగింది. రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు మరణంతో వీరి వివాహం వాయిదా పడింది. నవంబర్ 1న ప్రముఖ కన్నడ నటుడు, ‘పుష్ప’ ఫేమ్ డాలీ ధనుంజయ్ వివాహ నిశ్చితార్థం డాక్టర్ దంత్యకేల తో జరిగింది. ఇదే నెల 3న ఎన్టీఆర్ బావమరిది, హీరో నార్నే నితిన్ ఎంగేజ్ మెంట్ శివానీతో జరిగింది. 26న హీరో అక్కినేని అఖిల్ వివాహ నిశ్చితార్థం జైనబ్ రల్డీతో జరిగింది. వీరి పెళ్ళి 2025లో ఉంటుందని నాగార్జున తెలిపారు.

పేరెంట్స్  గా ప్రమోషన్ కొట్టిన నటులు.. 

ఈ యేడాది ఎంతోమందికి పేరెంట్స్ హోదా దక్కింది. జనవరి 22న సుహాస్ భార్య మగబిడ్డకు జన్మనివ్వగా, ఫిబ్రవరి 5న దర్శకుడు వశిష్ఠ భార్య సుజాత ఆడబిడ్డను ప్రసవించింది. అదే నెల 15న ప్రముఖ నటి అనుష్క శర్మ, విరాట్ కొహ్లీ దంపతులకు మగపిల్లవాడు పుట్టాడు. ఫిబ్రవరి 21న హీరో నిఖిల్ భార్య పల్లవి వర్మ మగబిడ్డకు జన్మనిచ్చింది. అదే రోజు సింగర్ సాగర్ భార్య డాక్టర్ మోనిక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఏప్రిల్ 13న మంచు మనోజ్, మౌనిక దంపతులకు ఆడపిల్ల జన్మించింది. మే 10న నటి యామీ గౌతమి మగబిడ్డను ప్రసవించింది. ప్రముఖ నటి అమలాపాల్ జూన్ 11న మగబిడ్డను ప్రసవించింది. సెప్టెంబర్ 8న రణవీర్ సింగ్, దీపికా పదుకొనే దంపతులకు ఆడబిడ్డ పుట్టింది.

విడాకుల విషాదాలు.. 

బాధాకరం ఏమంటే… ఈ యేడాది కొందరు సెలబ్రిటీస్ విడాకుల ప్రకటనలు చేసి వారి అభిమానుల హృదయాలను గాయపరిచారు. ధర్మేంద్ర, హేమమాలిని కుమార్తె ఈషా తాను విడాకులు తీసుకుంటున్నట్టు తెలిపింది. అలానే సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ తన భార్య, గాయిని సైంధవికి డైవోర్స్ ఇస్తున్నట్టు చెప్పాడు. నటుడు జయం రవి; ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ సైతం చేసిన విడాకుల ప్రకటనలు సంచలనం సృష్టించాయి. సంవత్సరాల పాటు కాపురం చేసి… ఇప్పుడీ నిర్ణయం తీసుకోవడం ఏమిటంటే అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. 2022లోనే విడిపోతున్నట్టు ప్రకటించిన స్టార్ హీరో, డైరెక్టర్ ధనుష్, రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యకు కోర్టు నవంబర్ 27న విడాకులు మంజూరు చేసింది.

ఇది వివాదనామ సంవత్సరం.. 

2024లో వివాదాలకు కొదవలేకుండా పోయింది. ఊహించని విధంగా కొందరిని ఈ వివాదాలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. మరికొందరిని కోర్టు గడప తొచ్చించాయి. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చింది.

నయనతార ఈ యేడాది ఏకంగా రెండు వివాదాల్లో చిక్కుకుంది. ఆమె నటించిన ‘అన్నపూర్ణ’ మూవీలో వివాదాస్పద సన్నివేశాలు ఉన్నాయని హిందు సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. నయనతార బహిరంగ క్షమాపణలు చెప్పినా అవి వెనకడుగు వేయలేదు. చివరకు చిత్ర నిర్మాతలు నెట్ ఫ్లిక్స్ లోని ఆ సినిమాను స్ట్రీమింగ్ ను ఆపేసి, అభ్యంతరకర సన్నివేశాలను తొలగించారు. అలానే హీరో ధనుష్ తో నయన్, ఆమె భర్త విఘ్నేష్ శివన్ గట్టిగానే గొడవపెట్టుకున్నారు. ‘నానుమ్ రౌడీదాన్’మూవీ క్లిప్లింగ్స్ వాడుకోవడానికి అనుమతి ఇవ్వని ధనుష్ ను నయన్ దుమ్మెత్తిపోశారు. దాంతో ధనుష్ లీగల్ నోటీస్ ఇవ్వడంతో పాటు… కోర్టులో పరువు నష్టం దావా కూడా వేశారు.

‘’వ్యూహం, రాజధాని ఫైల్స్’ వంటి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీస్ విడుదలకు ముందు పలు ఇబ్బందులను ఎదుర్కొని, కోర్టు గడపలు తొక్కి చివరకు థియేట్రికల్ రిలీజ్ కు వెళ్ళాయి. కానీ వాటిని ఎవరూ పట్టించుకోలేదు. ఇక సంక్రాంతికి వచ్చిన ‘హను-మాన్’కి అగ్రిమెంట్ ప్రకారం థియేటర్లు ఇవ్వలేదని, ఎగ్జిబీటర్స్ పై నిర్మాతలు ఛాంబర్ లో ఫిర్యాదు ఇచ్చారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కథాచౌర్యంపై ఉన్న కేసును కొట్టేయాలని సుప్రీంను ఆశ్రయిస్తే అక్కడ చుక్కెదురైంది. సర్వైకల్ కాన్సర్ తో చనిపోయినట్టుగా పూనమ్ పాండే పీఆర్ టీమ్ చేసిన ప్రచారం బెడిసి కొట్టింది. ఆమె ఉద్దేశ్యం మంచిదే అయినా… ప్రాణాలు పోయినట్టు డ్రామా ఆడటం ఏమిటని నెటిజన్స్ విమర్శించారు. 

‘యాత్ర-2’ నిర్మాత మహి వి రాఘవ హార్సిలీ హిల్స్ లో భూ వివాదంలో వార్తలలో నిలిచారు. అలానే బండ్ల గణేశ్ కు చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు శిక్ష పడింది. యూట్యూబర్, బిగ్ బాస్ షేమ్ షణ్ముఖ్ జస్వంత్ గంజాయి కేసులో ఇరుక్కున్నాడు. అలానే ఫిబ్రవరి 27న రాడిసన్ హోటల్ లో జరిగిన డ్రగ్స్ పార్టీలో క్రిష్ తో పాటు కొందరు సినీ నటులు ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. దాంతో క్రిష్ ముందస్తు బెయిల్ కు అప్లయ్ చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. క్రియా హెల్త్ కేర్ అధినేత వేణుమాధవ్ ను కిడ్నాప్ చేసి, బలవంతంగా షేర్లు బదలాయింపు చేశారనే ఆరోపణపై మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ ను పోలీసులు విచారణ చేశారు. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాకు చెందిన 98 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను మనీ లాండరింగ్ కు పాల్పడిన ఆరోపణలతో ఈడీ అటాచ్ చేసింది.

ALSO READ  Sunrisers Hyderabad: హండ్రెడ్ లీగ్ లోకి సన్ రైజర్స్ జట్టు..! అక్కడ కూడా మన హవానే

నటి హేమ చుట్టూ ఈ యేడాది వివాదాలు ముసురుకున్నాయి. మే 20న బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్న హేమ డ్రగ్స్ వాడిందనే ఆరోపణలు వచ్చాయి. తాను నిరపరాధినంటూ హేమ చెప్పినా… పోలీసులు విచారణ పేరుతో అరెస్ట్ చేశారు. ఆపైన కోర్టు రిమాండ్ విధించింది. దాంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆమెకు కొంతకాలం పాటు సస్పెండ్ చేసింది. అలానే అభిమాని రేణుకా స్వామి హత్యకేసులు కన్నడ స్టార్ హీరో దర్శన్, అతని ప్రియురాలు, సహ నటి పవిత్ర గౌడాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక యువ కథానాయకుడు రాజ్ తరుణ్ వ్యక్తిగత జీవితం రచ్చకెక్కింది. కొన్నేళ్ళుగా అతనితో సహజీవనం చేస్తున్న లావణ్య అతనిపై కేసులు పెట్టింది. హీరోయిన్ మాల్వీ మల్హోత్రా మాయలో పడి రాజ్ తరుణ్ తనను విస్మరిస్తున్నాడని ఆరోపించింది. మరో పక్క మాల్వీ సైతం లావణ్యపై కేసు పెట్టింది.

తండ్రీ కూతుళ్ళకు సంబంధించిన ఓ వీడియోపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూ ట్యూబర్, నటుడు ప్రణీత్ హన్ముంతును బెంగళూరు పోలీసులు జులై 10న అరెస్ట్ చేశారు. ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు, నటుడు అమన్ ను డ్రగ్స్ కేసులో పోలీసులు జులై 15న అదుపులోకి తీసుకుని విచారించారు. నటుడు, నిర్మాత విశాల్ పై నిర్మాతల మండలి తీవ్ర ఆరోపణలు చేసింది. అతను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దాదాపు 12 కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగిందని తెలిపింది. దీనిని విశాల్ ఖండించాడు. అలానే ధనుష్ ను కూడా నిర్మాతల మండలి టార్గెట్ చేసింది. పాత చిత్రాలు పూర్తి చేయకుండా కొత్త సినిమాలు కమిట్ కాకూడదని హెచ్చరించింది. దీనిని నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ ఖండించాడు. 

ఆగస్ట్ 25న కేరళ లో హేమ కమిటీ ఇచ్చిన నివేదకతో మల్లూవుడ్ అట్టుడికిపోయింది. ‘అమ్మ’ అద్యక్ష పదవికి మోహన్ లాల్ రాజీనామా చేశారు. ఆయనతో పాటు కార్యవర్గం సైతం రిజైన్ చేసింది. మలయాళ నటులు, దర్శకులు, నిర్మాతలు పోలీసు కేసులను ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముంబైకి చెందిన నటి కాదంబరి జెత్వానీ జగన్ ప్రభుత్వ హయాంలోని ఏపీ పోలీసులు తనతో దారుణంగా ప్రవర్తించారంటూ మొరపెట్టుకుంది. ‘జైలర్’మూవీ విలన్ ను హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో పోలీసులు అనుచిత ప్రవర్తన కారణంగా అరెస్ట్ చేశారు. జానీ మాస్టర్ పై ఆయన అసిస్టెంట్ పెట్టిన కేసు దుమారం లేపింది. పోలీసులు జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. బెస్ట్ కొరియోగ్రాఫర్ గా ఎంపికైన జానీ మాస్టర్ దానిని స్వీకరించే ఆస్కారం కూడా లేకుండా పోయింది. 

యూ ట్యూబర్ హర్ష సాయి, సీనియర్ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ సైతం వివిధ కేసులపై  పోలీసుల గడప తొక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అలానే చెన్నయ్ లోని ఓ కార్యక్రమంలో నటి కస్తూరి తెలుగువారిపై చేసిన వ్యాఖ్యలు పలువురి మనోభావాలను దెబ్బతీశాయి. ఆమె క్షమాపణలు తెలిపినా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే యేడాది చివరిలో మోహన్ బాబు కుటుంబంలో మొదలైన ముసలం మరో ఎత్తు. మంచు విష్ణు, మనోజ్ మధ్య చెలరేగిన వివాదం ఈ కుటుంబాన్ని అతలాకుతలం చేసింది. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుని ప్రాణ హాని ఉందని పోలీసులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆవేశంలో జర్నలిస్ట్ లపై చేయి చేసుకున్న మోహన్ బాబు చివరకు క్షమాపణలు  చెప్పాలి వచ్చింది. అలానే అల్లు అర్జున్ ‘పుష్ప-2’ మూవీ ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోవడం… అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వెళ్లింది. ఓ రాత్రి అంతా బన్నీ జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చింది. రెండు కోట్ల రూపాయల ఆర్థిక సాయం బాధిత కుటుంబానికి వచ్చినా… కేసులు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలోనే ఈ యేడాది అత్యధిక గ్రాస్ ను వసూలు చేసిన చిత్రంగా నిలిచిన ‘పుష్ప-2’… ఆ చిత్ర కథానాయకుడు, దర్శకుడు, నిర్మాతలకు ఓ పీడకలగా పరిణమించడం శోచనీయం.

విషాదాలు.. 

ఈ యేడాది పలువురు సినీ దిగ్గజాలు భువి నుండి దివికేగారు. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన రామోజీరావు, అనువాద చిత్రాలకు అద్భుతమైన మాటలు రాసిన రామకృష్ణ, జాతీయ స్థాయిలో సినిమా గొప్పతనాన్ని చాటిన దర్శకుడు శ్యామ్ బెనెగల్ వారిలో ఉన్నారు.

ప్రముఖ సంగీత దర్శకుడు, మాస్ట్రో ఇళయారాజా కుమార్తె భవతారణి కాన్సర్ తో కన్నుమూసింది. గాయనిగా, సంగీత దర్శకురాలిగానూ ఆమెకు చక్కని గుర్తింపు ఉంది. తెలుగులోనూ ‘అవునా’ చిత్రానికి ఆమె స్వరాలు సమకర్చింది. ‘దంగల్’లో ఆమీర్ ఖాన్ చిన్న కూతురుగా నటించిన సుహానీ భగ్నాగర్ చిరు ప్రాయంలోనే అనారోగ్యంతో చనిపోయింది. ప్రముఖ గజల్ గాయకుడు పంకజ్ ఉద్దాస్ ఫిబ్రవరి 26న దివికేగారు. అదే నెల 29న సినీ గాయకుడు, జానపద కళాకారుడు వడ్డేపల్లి శ్రీనివాస్ తుదిశ్వాస విడిచారు. బాలనటుడిగా పలు చిత్రాలలో నటించిన సూర్యకిరణ్ ఆ తర్వాత దర్శకుడిగా ‘సత్యం, ధన 51, బ్రహాస్త్రం, రాజు భాయ్’వంటి సినిమాలు తీశారు. బిగ్ బాస్ లోనూ పాల్గొన్న సూర్యకిరణ్ మార్చి 11న తనువు చాలించారు. 

పలు తమిళ చిత్రాలతో పాటు తెలుగులోనూ ‘టక్ జగదీశ్’లో నటించిన ‘డేనియల్’బాలాజీ గుండెపోటుతో మార్చి 29న కన్నుమూశారు. అనువాద చిత్రాల రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రామకృష్ణ ఏప్రిల్ 1న కన్నుమూశారు. రజనీకాంత్ ‘దర్బార్’ఆయన చివరగా మాటలు రాసిన సినిమా. రామకృష్ణ ‘బాలమురళీ ఎం.ఎ., సమాజంలో స్త్రీ’చిత్రాలకు దర్శకత్వం వహించారు. బెస్ట్ కాస్ట్యూమర్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న ‘దాసి’ఫేమ్ పిట్టంపల్లి సుదర్శన్ ఏప్రిల్1న కన్నుమూశారు. అదే రోజున హాస్యనటుడు గరిమెళ్ళ విశ్వేశ్వరరావు చనిపోయారు. ప్రముఖ దర్శకుడు సంగీత్ శివన్ మే 8న అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ‘వ్యూహం, యోధ, క్యా కూల్ హై హమ్, యమ్లా పగ్లా దీవానా -2’ వంటి చిత్రాలను ఆయన రూపొందించారు.

మీడియా మొగల్ రామోజీరావు జూన్ 8న తుదిశ్వాస విడిచారు. 1984లో చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టిన ఆయన వివిధ భాషల్లో 87 సినిమాలను నిర్మించారు. ‘’గులాజీ, అనగనగా ఒకరోజు, పాతబస్తీ’ తదితర చిత్రాలకు మాటలు రాసిన నడిమింటి నరసింగరావు అనారోగ్యంతో కన్నుమూశారు. కొరియోగ్రాఫర్, డైరెక్టర్ కె. రాజేంద్ర ప్రసాద్ ఆగస్ట్ 30న క్యాన్సర్ తో చనిపోయారు. గీత రచయితగా చక్కని గుర్తింపు తెచ్చుకున్న వడ్డేపల్లి కృష్ణ సెప్టెంబర్ 6న చనిపోయారు. ‘బలగం’సినిమాలో ఆయన కాసేపు తెర మీద మెరిశారు. ‘ఒక దీపం వెలిగింది, వియ్యాలవారి కయ్యాలు, శ్రీ వినాయక విజయం, కోడళ్ళు వస్తున్నారు జాగ్రత్త’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి అక్టోబర్ 26న కన్నుమూశారు. తమిళంతో పాటు కొన్ని తెలుగు సినిమాలలోనూ నటించిన ఢిల్లీ గణేశ్ నవంబర్ 10న తుదిశ్వాస విడిచారు. జర్నలిజం నుండి సినిమారంగంలోకి గీత రచయితగా అడుగుపెట్టిన కులశేఖర్ నవంబర్ 25న అనారోగ్యంతో కన్నుమూశారు. ‘చిత్రం’మూవీతో గీత రచయితగా మారిన ఆయన ‘ప్రేమలేఖ రాశా’ చిత్రాన్ని డైరక్ట్ చేశారు. వందలాది సూపర్ హిట్ గీతాలను రచించారు.

ఈ యేడాది వెళ్ళిపోతూ… సినీ దిగ్గజాన్ని తీసుకెళ్ళిపోయింది. 1973లో ‘అంకుర్’తో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన శ్యామ్ బెనెగల్ దేశం గర్వించే దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. సినిమా దర్శకుడిగా, డాక్యుమెంటరీస్ మేకర్స్ గా ఎనలేని ఖ్యాతిని గడించారు. జవహర్ లాల్ నెహ్రూ రాసిన ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ను దూరదర్శన్ కోసం ఆయన డాక్యుమెంటరీగా తీశారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత శ్యామ్ బెనెగల్ డిసెంబర్ 23న తుది శ్వాస తీశారు. 25న ప్రముఖ మలయాళ నటుడు, దర్శకుడు ఎం.టి. వాసుదేవన్ నాయర్ కన్నుమూశారు. దాదాపు యాభై చిత్రాలకు ఆయన స్క్రీన్ ప్లే సమకూర్చారు. ఏడు సినిమాలను డైరెక్ట్ చేశారు. ఆయన కథల ఆధారంగానే ఆ మధ్య ‘మనోరథంగళ్’వెబ్ సీరిస్ రూపుదిద్దుకుంది. డిసెంబర్ 26న తమిళ దర్శకుడు సభపతి చనిపోయారు. తెలుగులో ఆయన జగపతి బాబు ‘పందెం’ సినిమాను డైరెక్టర్ చేశారు. చిరంజీవి నటించిన ‘అంజి’ సినిమాకు తొలి దర్శకుడు సభాపతే. అందులోని రమ్యకృష్ణ పాటను ఆయనే చిత్రీకరించారు. 

జరిగేదంతా మంచికని… అనుకోవడమే మనిషి పని అన్నారో కవి. అలా గడచిన సంవత్సరంలోని చేదు జ్ఞాపకాలను మర్చిపోతూ… ఆశల పల్లకిలో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతుంటారు సినీజనం… వారికి ఆల్ ద బెస్ట్ చెబుదాం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *