Ganja Seized

Ganja Seized: ఎనర్జీ డ్రింక్ టిన్స్ లో గంజాయి.. ఏకంగా రూ. 200 కోట్లు విలువ

Ganja Seized: దేశంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా (డ్రగ్స్ స్మగ్లింగ్)పై కస్టమ్స్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా, బెంగుళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అసాధారణ రీతిలో జరుగుతున్న విదేశీ గంజాయి స్మగ్లింగ్‌ను ఛేదించారు. ఏకంగా రూ. 200 కోట్ల విలువ చేసే 273 కేజీల విదేశీ గంజాయిని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఈ ఒక్క నవంబర్ నెలలోనే అత్యధికంగా గంజాయి పట్టుబడటం విశేషం.

స్మగ్లర్ల ‘కొత్త’ పంథా: ఎనర్జీ డ్రింక్స్… ట్రాలీ బ్యాగ్!

స్మగ్లర్లు కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి గంజాయిని తరలించేందుకు కొత్త పద్ధతులను అనుసరించడం అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. బ్యాంకాక్ నుంచి బెంగుళూరు చేరుకున్న నలుగురు విదేశీయుల వద్ద అధికారులు గంజాయిని గుర్తించారు. నిందితులు గంజాయిని ప్యాక్ చేసి, ఏమాత్రం అనుమానం రాకుండా ఎనర్జీ డ్రింక్ టిన్స్ (డబ్బాలు) లో నింపి యథావిధిగా ప్యాకింగ్ చేశారు.

ఇది కూడా చదవండి: Breakfast Meeting: బ్రేక్ ఫాస్ట్ కి రా నీతో మాట్లాడాలి.. నేడు సిద్దూ, డీకే భేటీ!

మరో తరలింపు మార్గంలో, గంజాయిని ట్రాలీ బ్యాగ్ కింది భాగంలో ప్రత్యేకంగా ఓ రహస్య స్థావరం ఏర్పాటు చేసి దాచి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే, ఎయిర్‌పోర్టులో నిందితుల వ్యవహారశైలిపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, ఈ భారీ స్మగ్లింగ్ గుట్టు రట్టైంది. ఈ కేసులో నలుగురు విదేశీయులతో సహా మొత్తం 32 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు.

బ్యాంకాక్ అడ్డాగా అంతర్జాతీయ స్మగ్లింగ్:

పట్టుబడిన గంజాయి మొత్తం విదేశీది కావడంతో, అంతర్జాతీయ స్థాయిలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బ్యాంకాక్ దేశాన్ని అడ్డాగా చేసుకుని ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది.

డ్రగ్స్ (ఇతర మాదక ద్రవ్యాల)కు బదులు విదేశీ గంజాయి స్మగ్లింగ్‌పై ఈ ముఠా ఎక్కువగా దృష్టి సారించినట్లు సమాచారం. ఈ నెల మొదటి వారంలోనే రూ. 94 కోట్ల విలువ చేసే 94 కేజీల గంజాయిని సైతం అధికారులు సీజ్ చేశారు.

యువతే లక్ష్యం:

ఈ స్మగ్లర్ ముఠా ప్రధానంగా దేశంలోని యువతను, ముఖ్యంగా విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, బడా బాబుల పిల్లలను టార్గెట్ చేసి, వారికి మాదకద్రవ్యాలు అలవాటు చేస్తూ వారి జీవితాలను నాశనం చేస్తోంది. రేపటి పౌరులుగా మారాల్సిన యువతను ఈ గ్యాంగ్‌ సభ్యులు మాదక ద్రవ్యాల మాయలో ముంచుతున్నారు. పోలీసులు ఎంత కట్టడి చేసినా, కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తూ కోట్లలో డబ్బులు సంపాదించేందుకు ఈ అక్రమ రవాణాను కొనసాగిస్తున్నారు.

ఈ భారీ పట్టుదలతో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నెట్‌వర్క్‌పై కస్టమ్స్ అధికారులు మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *