Imtiaz ahmed: ఏపీలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. మాజీ ఐఏఎస్ అధికారి అయిన ఇంతియాజ్ అహ్మద్ వైసీపీకి రాజీనామా చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ లేఖ విడుదల చేశారు. 2024 ఎన్నికల ముందు ఉన్నట్టుండి ఖద్దరు మీద మోజు పెరిగిన ఆయనకు వైసీపీలోకి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కర్నూలు అసెంబ్లీ టిక్కెట్ ఖరారు చేసుకున్నారు. అప్పటి వరకు కర్నూలు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న హఫీజ్ ఖాన్ మరోసారి టికెట్ కోసం పోరాటం చేస్తున్న సమయంలోనే ఊహించని విధంగా మెరుపుతీగలా రేస్‌లోకి వచ్చి కర్నూల్ సీటును ఇంతియాజ్ ఎగరేసుకుపోయారు. కానీ.. ఆయన అనుకున్నదొక్కటి, అయ్యింది మరొక్కటి… సీటు వచ్చిన ఆనందంలో కర్నూలు వైసీపీలో ఉన్నవర్గ పోరును అంచన వేయలేక పోయారు. వర్గ పోరుతోనే 2024 ఎన్నికల్లో ఇంతియాజ్ ఓడిపోయారు.
కర్నూలు నియోజకవర్గంలోని వైసీపీలో అప్పటి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిల మధ్య విభేదాలు ఉన్నాయి కర్నూల్ టికెట్ కోసం ఇద్దరు నేతలు గట్టిగా ప్రయత్నం చేశారు. కానీ చివరకు ఇంతియాజ్‌కు టికెట్ ఖరారయ్యింది.
ఇంతియాజ్ వైసీపీ క్యాడర్‌ను తన వైపు తిప్పుకోవడంలో విఫలమయ్యారు. దీనికి తోడు ఎవరికి వారే యమునా తీరు అన్నట్లు మాజీ లిద్దరూ కూడా నామ్ కివాస్తే ప్రచారం చేశారు. అత్యధిక ముస్లిం ఓటర్లు ఉన్న కర్నూలు నియోజకవర్గంలో అందరూ తమకు ఓట్లుపడతాయని భావించారు. కానీ కూటమి వేవ్‌లో చాలా మంది వైసీపీ నాయకులాగే ఇంతియాజ్ కూడా ఓడిపోయారు. ఎస్వీ మోహన్ రెడ్డి, హఫీజ్ ఖాన్‌తో పాటు వైసీపీ క్యాడర్ కూడా ఇంతియాజ్ గెలుపు కోసం కృషి చేయలేదని పలు ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఇద్దరు రాజకీయ ఉదండుల మధ్య పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఇంతియాజ్ ఓడిపోయిన తరవాత పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు రాజకీయాల్లోకి రావాలని తీసుకున్న నిర్ణయం రైటా, రాంగా? అంటూ తెగ మధనపడిపోయరట… ఎందుకొచ్చిన ఈ రాజకీయాలు… మంచి జీతం, జీవితం, ఏసీ రూములో కూర్చుని చేసే ఉద్యోగం… అన్నీ వదులుకుని చాలా నష్టపోయానంటూ సన్నిహితుల వద్ద బాధపద్దారట ఇంతియాజ్…
దీనికి తోడు ఓడిపోయిన తరవాత అధినేత నుంచి పిలుపు రాలేదని పలువురు నేతలు గుసగుసలాడుకున్నారు.
ఏది ఏమైనా రాజకీయాలకు దూరంగా ఉండాలని ఇంతియాజ్ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల్లో రాణించాలంటే బలమైన క్యాడర్‌తో పాటు అందరినీ తనవైపు తిప్పుకునే సత్తా ఉండాలి. తలపండిన నేత అయ్యి ఉండాలి. కానీ ఇంతియాజ్ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఉండి… రాజకీయాల్లో ఎలాంటి అనుభవం లేని నేతగా వచ్చి ఓడిపోయారు. చివరకు పొలిటికల్ కేరీర్‌కి ఫుల్ స్టాఫ్ పెట్టేశారు.
మొత్తానికి ఇంతియాజ్ పొలిటికల్ కెరీర్ ఫుల్ స్టాప్‌కి వారే కారణమని ఫ్యాన్ పార్టీ నాయకులే బహిరంగంగా చర్చించుకుంటున్నారు ఉప్పునిప్పులా ఉండే హఫీజ్ ఖాన్, ఎస్వీ మోహన్ రెడ్డిలు ఎవరికి వారే అన్నరీతిలో ఉన్నారు.
ఇంతియాజ్ రాజీనామా తర్వాత ఒక్కరూ కూడా స్పందించకపోవడం విశేషం.
రాసినవారు: ఖలీల్
సీనియర్ కరస్పాండెంట్
కర్నూలు జిల్లా