Fire Accident

Fire Accident: పాత బస్తీ శాలిబండలో భారీ అగ్ని ప్రమాదం..

Fire Accident: పాతబస్తీ శాలిబండ ప్రాంతం నిన్నటి రోజున అగ్ని ప్రమాదంతో వణికిపోయింది. మొఘల్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని లాల్ దర్వాజ ఎక్స్‌ రోడ్ వద్ద ఉన్న ‘గోమతి ఎలక్ట్రానిక్స్ షోరూం’లో భారీగా మంటలు చెలరేగి తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ భయంకరమైన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాద తీవ్రత, ఘటన వివరాలు

లాల్ దర్వాజ క్రాస్ రోడ్స్ సమీపంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద ఉన్న ఈ ఎలక్ట్రానిక్స్ షోరూం రెండు అంతస్తుల్లో విస్తరించి ఉంది.స్థానిక సమాచారం ప్రకారం, మొదట ఒక ఫోర్ వీలర్ వాహనం అదుపు తప్పి బిల్డింగ్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి.

అయితే, పోలీసులు మాత్రం విద్యుత్ షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.రెండు అంతస్తుల్లో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు (ఫ్రిజ్‌లు, ఏసీలు, టీవీలు) తదితరాలకు మంటలు వేగంగా వ్యాపించడంతో ప్రమాద తీవ్రత పెరిగింది.

మంటల ధాటికి రిఫ్రిజిరేటర్లలోని సిలిండర్లు పేలిపోవడం, భారీ శబ్దాలు రావడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది.ఈ ప్రమాదంలో షోరూం పక్కనే ఉన్న లక్ష్మీ వస్త్ర దుకాణంలోకి కూడా మంటలు వ్యాపించి అందులోని సామగ్రి పూర్తిగా దగ్ధమైనట్లు యజమాని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Delhi: ట్రాయ్ అదరహో..21 లక్షల స్పామ్లు కట్

సీఎన్‌జీ కారులో చిక్కుకుని మృతి

ఈ అగ్నిప్రమాదంలో అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఎలక్ట్రానిక్స్ షోరూం వద్ద పార్క్ చేసి ఉన్న ఒక సీఎన్‌జీ (CNG) కారుకు మంటలు అంటుకుని పూర్తిగా కాలిపోయింది.కారులో ఉన్న వ్యక్తి మంటల నుంచి తప్పించుకోలేక అందులోనే చిక్కుకుని మృతి చెందాడు. ఈ విషయాన్ని జిల్లా ఫైర్ అధికారి శ్రీదాస్ ధృవీకరించారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాద సమయంలో ఆ దారిలో వెళుతున్న ఎర్రకుంటకు చెందిన జమీర్, ఆయన భార్య నదియా బేగంతో పాటు మొత్తం ఐదుగురు గాయపడినట్లు దక్షిణ మండలం డీసీపీ కిరణ్ ప్రభాకర్ తెలిపారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

అదుపు చేసిన ఫైర్ సిబ్బంది

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.సుమారు 8 నుండి 10 వరకు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. మంటల ఉధృతి, పేలుతున్న ఎలక్ట్రానిక్ వస్తువుల కారణంగా మంటలను అదుపులోకి తీసుకురావడం వారికి సవాలుగా మారింది.

మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు, చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దక్షిణ మండలం డీసీపీ కిరణ్ ప్రభాకర్, ఛత్రినాక ఏసీపీ చంద్రశేఖర్ సంఘటనా స్థలాన్ని సందర్శించి, నష్టాన్ని, ప్రమాదానికి గల కారణాలను పరిశీలించారు.

పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి, షార్ట్ సర్క్యూట్ కోణంలో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన పాతబస్తీలో తీవ్ర కలకలం సృష్టించింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *