D. K. Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై గత కొన్ని రోజులుగా రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించిన ఊహాగానాలకు, కాంగ్రెస్ నాయకత్వంలోని విభేదాల చర్చలకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈరోజు ఉదయం నిర్వహించిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పూర్తిగా తెరదించింది. ఈ సమావేశంపై డీకే శివకుమార్ పూర్తి సంతృప్తి వ్యక్తం చేయడమే కాక, తామిద్దరం కలిసికట్టుగా పార్టీని, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
చర్చలు ఫలవంతం అయ్యాయి.. డీకే
సీఎం సిద్ధరామయ్యతో జరిగిన చర్చల అనంతరం డీకే శివకుమార్ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ చాలా బాగుంది. మేం ఇద్దరం కలిసి కూర్చోవడం ద్వారా, మేం ఇద్దరు కలిసికట్టుగా ఉన్నామనే సందేశాన్ని ప్రజలకు ఇస్తున్నాం అని డీకే శివకుమార్ పేర్కొన్నారు.
తమ ఇద్దరి మధ్య చర్చలు చాలా ఫలవంతం అయ్యాయని, ముఖ్యంగా కర్ణాటక ప్రాధాన్యతలు ఏమిటి, ప్రజలకు ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలి అనే అంశాలపై దృష్టి సారించామని ఆయన తెలిపారు. కర్ణాటక ప్రజలు మాపై సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే మా లక్ష్యం. అందుకే మేం కలిసి పనిచేస్తాం, అని ఆయన గట్టిగా చెప్పారు.
క్యాంపు రాజకీయాలకు చెక్
ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి మధ్య ఉన్నట్లుగా మీడియాలో వచ్చిన ‘క్యాంపు రాజకీయాలు’ మరియు ‘శీతకలహం’ వార్తలను డీకే శివకుమార్ పూర్తిగా తోసిపుచ్చారు.
కర్ణాటక కాంగ్రెస్లో క్యాంపు రాజకీయాలు లేవు. పార్టీని పటిష్టం చేయడం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే అత్యంత ప్రాధాన్యత, అని ఆయన పునరుద్ఘాటించారు.
ఇది కూడా చదవండి: Malaika Arora: మలైకా అరోరా ఫిట్నెస్ సీక్రెట్ చెప్పేసింది.. ఉదయం లేవగానే
సిద్ధరామయ్య మాదిరిగానే డీకే కూడా పార్టీ అధిష్టానం పట్ల విధేయతను చాటుకున్నారు. హైకమాండ్ నిర్ణయాన్ని శిరసావహిస్తాం. అంతకు మించి ఒక్కమాట మాట్లాడం, అని ఆయన స్పష్టం చేశారు. ఇది సీఎం మార్పు లేదా పంచుకునే పదవీకాలం వంటి సున్నితమైన అంశాలపై మీడియా చర్చలకు తావు ఇవ్వకుండా జాగ్రత్తపడడాన్ని సూచిస్తోంది.
2028 లక్ష్యం, ప్రజలకు హామీల అమలు
సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ ఈ సమావేశం ద్వారా తమ భవిష్యత్ కార్యాచరణపై పూర్తి స్పష్టత ఇచ్చారు. 2028లో కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే అంతిమ లక్ష్యమని, ప్రస్తుతం కర్ణాటక ప్రజలకు ఇచ్చిన హామీలను, ముఖ్యంగా గ్యారెంటీ పథకాలను విజయవంతంగా అమలు చేయడమే తమ తక్షణ కర్తవ్యమని నేతలు తేల్చి చెప్పారు.
ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ద్వారా కర్ణాటక కాంగ్రెస్ నాయకత్వం తమ ఏకీకృత శక్తిని ప్రదర్శించి, ప్రభుత్వాన్ని అస్థిరం చేయాలని చూస్తున్న ప్రతిపక్షాలకు గట్టి జవాబు ఇచ్చినట్లయింది.

