Ditwah Cyclone

Ditwah Cyclone: దూసుకొస్తున్న దిత్వా తుపాను.. ఏపీలోని ఈ రెండు జిల్లాల్లో భారీ వర్షాలు..

Ditwah Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దిత్వా’ తుపాను (Ditwa Cyclone) మరింత బలపడి, ఉత్తర-వాయువ్య దిశగా వేగంగా కదులుతూ ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా తీరానికి సమీపిస్తోంది. వరుస తుపానుల కారణంగా ఇప్పటికే తీవ్ర నష్టం చవిచూసిన రాష్ట్రం మరో భారీ ముప్పు అంచున ఉంది. వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో, తీర ప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

దిత్వా తుపాను తాజా కదలికలు

నైరుతి బంగాళాఖాతం, ఉత్తర శ్రీలంక ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న ఈ తుపాను గడిచిన ఆరు గంటల్లో గంటకు సుమారు 10 కిలోమీటర్ల వేగంతో ఉత్తరం వైపుగా పయనిస్తోంది. ప్రస్తుతానికి ఇది పుదుచ్చేరికి దక్షిణ-ఆగ్నేయంగా 220 కిలోమీటర్లు, అలాగే చెన్నైకు దక్షిణాన 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. కాగా, ఈ తుఫాను ఉత్తర-వాయువ్య దిశగా పయనించి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకు సమీపంలోకి ఆదివారం తెల్లవారుజామున విస్తరించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు.

దక్షిణ కోస్తా, రాయలసీమల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

‘దిత్వా’ తుపాను ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. దక్షిణ కోస్తాంధ్రలోని అనేకచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉండగా, ఒకటి లేదా రెండుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: IBomma Ravi: ఐబొమ్మ రవి కస్టడీలో కీలక విషయాలు.. ‘బప్పం’ వెనుక కథ చెప్పిన రవి

అదేవిధంగా, రాయలసీమ ప్రాంతంలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయి. రాయలసీమలోనూ ఒకటి లేదా రెండుచోట్ల భారీ నుంచి అతి భారీవర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో రాబోయే కొద్ది గంటల్లోనే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రత్యేకంగా హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌

తుపాను తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, వాతావరణ శాఖ కీలకమైన జిల్లాలకు హెచ్చరికలను పెంచింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, ప్రకాశం, కడప, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది. ఈ జిల్లాల్లో అత్యవసర విభాగాలు పూర్తిస్థాయిలో అప్రమత్తమయ్యాయి.

మత్స్యకారులకు కఠిన హెచ్చరికలు: తుపాను ప్రభావం పూర్తిగా తొలగిపోయే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా కలెక్టరేట్‌లో ప్రజల సహాయార్థం కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయబడింది. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో 0861 – 2331261 మరియు 7995576699 నెంబర్లను సంప్రదించాలని కోరారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *