Dil raju: సంధ్య థియేటర్ ఘటన సినీ ఇండస్ట్రీతోపాటు రాజకీయాలను కూడా కుదిపేసింది. ఈ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అంశంపై కొన్ని రాజకీయ పార్టీలు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ, అల్లు అర్జున్‌ను కావాలనే కక్షపూరితంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు.
ఇటీవల తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతలు, దర్శకులు, ప్రముఖ నటులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సమావేశమయ్యారు. ఈ సమావేశంపై కూడా కేటీఆర్ వివిధ వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (FDC) చైర్మన్ దిల్ రాజు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు.సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన భేటీ ఒకరిద్దరితో చాటుమాటుగా జరగలేదని, ఇది పరిశ్రమ మొత్తానికి సంబంధించిన అంశమని పేర్కొన్నారు.
స్నేహపూర్వక చర్చలు: తెలుగు చిత్ర పరిశ్రమ బాగోగుల గురించి ముఖ్యమంత్రి అత్యంత స్నేహపూర్వకంగా చర్చించారని, ఆ సమావేశంపై పరిశ్రమ ప్రతినిధులు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు.
హైదరాబాద్‌ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్‌గా మార్చే ప్రణాళిక: ముఖ్యమంత్రి హైదరాబాదును గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న సంకల్పాన్ని సినీ పరిశ్రమ ప్రతినిధులు స్వాగతించారని వివరించారు.
తెలుగు చిత్ర పరిశ్రమను అనవసర రాజకీయ వివాదాల్లోకి లాగొద్దని, పరిశ్రమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని స్పందించాలన్నారు. లేనిపోని రాజకీయ దాడులు, ప్రతిదాడుల కోసం పరిశ్రమను వేదికగా వాడుకోవద్దని కోరారు.
లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్న తెలుగు చిత్ర పరిశ్రమకు అన్ని ప్రభుత్వాల సహకారం, ప్రజల ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నామని దిల్ రాజు తెలిపారు.