Anantapur: కుటుంబ కలహాలు ఎంతటి ఘోరానికి దారి తీస్తాయో చెప్పడానికి అనంతపురంలో జరిగిన ఈ విషాదమే నిదర్శనం. జిల్లా కేంద్రంలోని శారదా నగర్‌లో నివసించే ఓ డిప్యూటీ తహసీల్దార్ భార్య, మూడేళ్ల కుమారుడిని హత్య చేసి, ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్న దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రామగిరి డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న రవి భార్య అమూల్య, వారి కుమారుడు సహర్ష (3)తో కలిసి శారదా నగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. గత రెండు రోజులుగా భార్యాభర్తల మధ్య తీవ్రంగా గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ కలహాలే ఈ విషాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
గురువారం సాయంత్రం రవి తన డ్యూటీ ముగించుకుని ఇంటికి చేరుకున్నప్పుడు, ఎంత పిలిచినా భార్య అమూల్య తలుపు తీయలేదు. ఆమె ఫోన్ చేసినా స్పందించకపోవడంతో, అనుమానం వచ్చిన రవి వెంటనే అపార్ట్‌మెంట్ వాసులకు, పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మెయిన్ డోర్ పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ, అమూల్య చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించగా, ఆమె పక్కనే మూడేళ్ల కుమారుడు సహర్ష రక్తపు మడుగులో పడి ఉన్నాడు.
Also Read: Thanjavur: పెళ్లికి నో చెప్పిందని .. టీచర్ అని కూడా చూడకుండా ఏసేశాడు!
పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో, ముందు రోజు రాత్రి భర్త రవి, భార్య అమూల్యపై చేయి చేసుకున్నట్లు భావిస్తున్నారు. ఈ గొడవలతో తీవ్ర కోపానికి గురైన అమూల్య, భర్త డ్యూటీకి వెళ్లిన తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ దారుణ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. క్షణికావేశంలో మొదట కత్తితో కుమారుడు సహర్ష గొంతు కోసి హత్య చేసింది. ఆ తర్వాత అదే గదిలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
మృతురాలు అమూల్య తల్లిదండ్రులు, బంధువులు మాత్రం ఈ ఘటనకు పూర్తిగా భర్త రవి వేధింపులే కారణమని ఆరోపిస్తున్నారు. రవి తమ కూతురిని అదనపు కట్నం కోసం వేధించాడని, తరచూ శారీరకంగా హింసించేవాడని వారు కన్నీటి పర్యంతమయ్యారు. రవి వేధింపులు భరించలేకే అమూల్య ఈ దారుణానికి ఒడిగట్టిందని వారు వాపోయారు. అమూల్య భర్త రవిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కుటుంబ కలహాలు, భర్త వేధింపుల కారణంగా మూడేళ్ల పసిబిడ్డ ప్రాణంతో పాటు కన్నతల్లి బలవన్మరణానికి పాల్పడటం కలచివేసింది.

