Deeksha Divas-KCR: తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో, కేసీఆర్ శవయాత్రో.. తెలంగాణ జైత్రయాత్రో.. అని ప్రకటించి తెలంగాణ ఉద్యమకారుడిగా ఆమరణ నిరాహార దీక్షకు కేసీఆర్ పూనుకున్న తరుణం.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన దశ, దిశను మార్చిన అపురూప ఘట్టం.. 2009 నవంబర్ 29న ఆమరణ దీక్షను ప్రకటించి సిద్దిపేటకు కేసీఆర్ బయలుదేరి నేటికి 16 ఏండ్లు. నాటి నుంచి 11 రోజుల పాటు కేసీఆర్ చేపట్టిన దీక్ష దిగంతాలను ఏకం చేసింది. స్వరాష్ట్ర చరిత్రలో అజరామర ఘట్టంగా నిలిచింది.
Deeksha Divas-KCR: కేసీఆర్ ఆమరణ దీక్ష.. కేంద్రంలోని ఆనాటి యూపీఏ సర్కారు ప్రత్యేక తెలంగాణ ఇవ్వాల్సిన ఆవశ్యకతను సృష్టించింది. 2009 నవంబర్ 29న కరీంనగర్‌లో ఉన్న కేసీఆర్.. సిద్దిపేటలో ఆమరణ దీక్షకు పూనుకుంటాడన్న ప్రకటనతో తెలంగాణ అంతా ఉవ్వెత్తున ఎగిసిపడింది. మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజలు ఒక్కపెట్టున దిక్కులు పిక్కటిల్లేలా చేసిన జై తెలంగాణ నినాదాలు మిన్నంటాయి.
Deeksha Divas-KCR: తెల్లారేసరికి కరీంనగర్ పట్టణాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఉదయం 11 గంటల సమయంలో కేసీఆర్ తన ఇంటి నుంచి బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. బయటకు వెళ్లీ వెళ్లగానే కేసీఆర్‌ను పోలీసులు చుట్టుముట్టారు. ఉద్యమ శ్రేణులు జైతెలంగాణ నినాదాలతో వలయాలుగా ఏర్పాటై కేసీఆర్ వాహనానికి రక్షణ కవచంగా నిలిచాయి. పోలీసులను ప్రతిఘటించాయి. దీంతో తాత్కాలికంగా పోలీసులు వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
Deeksha Divas-KCR: సిద్దిపేటలోని ఆమరణ నిరాహార దీక్షా స్థలికి వేలాది మంది ఉద్యమకారులు తరలివచ్చేందుకు సిద్ధమయ్యారు. కరీంనగర్ నుంచి కేసీఆర్ వెంట నడిచేందుకు సంసిద్ధులయ్యారు. ఇదే సమయంలో ఎక్కడివారిని అక్కడే కట్టడి చేస్తూ పోలీసులు నిర్బంధ చర్యలు చేపట్టారు. ఉద్యమ శ్రేణులు తరలివచ్చే వాహనాల్లో గాలి తీస్తూ, దారి మళ్లిస్తూ అడ్డంకులు సృష్టించారు.
Deeksha Divas-KCR: అలుగునూరు చౌరస్తాలో మూడు చెక్ పోస్టులు పెట్టి పోలీసులు రోడ్లను పూర్తిగా బ్లాక్ చేశారు. బ్రిడ్జి ముందు రెండు చెక్ పోస్టులు పెట్టి ఉద్యమకారుల వాహనాలను కట్టడి చేశారు. కరీంనగర్‌లోని కేసీఆర్ ఇంటి నుంచి అలుగునూరు చౌరస్తా వరకు ఉన్నది కేవలం 4 కిలోమీటర్లే. కేసీఆర్ వాహన శ్రేణి వచ్చే తరుణంలో తమ ప్లాన్‌ను అమలు చేశారు. కేసీఆర్ కాన్వాయ్‌ను సుభాష్‌నగర్‌లో కుడివైపునకు మళ్లించారు. ఇతర వాహనాలను పక్కకు తప్పించి ఓవర్‌టేక్ చేసి కేసీఆర్ వాహనంతోపాటు పోలీసు సిబ్బంది వాహనాలను మానేరు వంతెన దాటించారు.
Deeksha Divas-KCR: అలుగునూరు చౌరస్తా నుంచి కేసీఆర్‌ను అరెస్టు చేసిన పోలీసులు బస్సులో ఎక్కించారు. తర్వాత ముందు, వెనుకా పదుల సంఖ్యలో పోలీసుల వాహనాలు బయలుదేరాయి. దారిపొడవునా మరో వాహనం లేకుండా చేశారు. రోడ్ల పక్కన కూడా మనుషులు లేకుండా చేయాలని పోలీస్‌స్టేషన్లకు, రాష్ట్ర పోలీస్ శాఖ కార్యాలయానికి సమాచారం వెళ్లింది. రోడ్లన్నీ నిర్మానుష్యం అయ్యాయి. ఇదే సమయంలో కరీంనగర్ నుంచి సిద్దిపేటకు ఆమరణ దీక్షకు వెళ్తున్న కేసీఆర్‌ను పోలీసులు అరెస్టు చేశారన్న వార్త తెలంగాణ వ్యాప్తంగా దావానలంలా వ్యాపించింది.
Deeksha Divas-KCR: ఆ తర్వాత నాటకీయ పరిణామాల మధ్య కేసీఆర్‌ను ఖమ్మంలో ఉన్న సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీరామమూర్తి ఎదుట హాజరుపర్చారు. అప్పటికే ఖమ్మం పోలీస్ స్టేషన్‌లో కేసీఆర్ సహా ఇతర నేతలపై రాజద్రోహం కేసు నమోదు చేశారు. ఆ తర్వాత న్యాయమూర్తి కేసీఆర్, ఇతర నాయకులకు 14 రోజుల రిమాండ్ విధించారు. వైద్య పరీక్షల అనంతరం అక్కడే కేసీఆర్ ఓ సంచలన ప్రకటన విడుదల చేశారు. తనను కరీంనగర్ అలుగునూరులో పోలీసులు ముట్టుకున్నరో.. అక్కడి నుంచి అప్పటి నుంచే తాను ఆమరణ దీక్షకు దిగినట్టు ప్రకటించారు.
Deeksha Divas-KCR: ఆ తర్వాత వివిధ పరిణామాల నడుమ కేసీఆర్ నిమ్స్ దవాఖానలో చికిత్స పొందడం, రోజురోజుకు ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ రావడం.. ఆ దశలో తెలంగాణ అట్టుడుకుతున్నది. కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకున్నది. ప్రజాకాంక్ష వైపే మొగ్గు చూపింది. డిసెంబర్ 9న కేంద్రం మంత్రి చిదంబరం తెలంగాణ ఇస్తున్నట్టు ప్రకటించారు. దీంతో కేసీఆర్ ఆమరణ దీక్షను విరమించారు. తెలంగాణ వ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి. చివరికి తెలంగాణ వచ్చి, తెలంగాణ జైత్రయాత్రతో కేసీఆర్ విజయం సాధించి పెట్టారు.

