Rain Alert: దిత్వా తుఫాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు ఇప్పటికే అతలాకుతలం అవుతుండగా, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎప్పుడైనా ‘ఫ్లాష్ ఫ్లడ్’ వచ్చే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, పొరుగునే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
తుఫాను కదలిక: పుదుచ్చేరి వైపు ‘దిత్వా’
ప్రస్తుతం (నవంబర్ 30, 2025) దిత్వా తుఫాను నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోంది. ఇది కడలూరు, కరైకల్ ప్రాంతాలకు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుఫాను రాబోయే 24 గంటల్లో ఉత్తర దిశగా, ఉత్తర తమిళనాడు తీరానికి సమాంతరంగా కదిలే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీని కారణంగా, ఈరోజు మధ్యాహ్నం/సాయంత్రం నాటికి ఇది ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాలకు 30 నుంచి 60 కిలోమీటర్ల సమీపంలోకి చేరుకునే అవకాశం ఉంది.
తెలంగాణలో మూడు రోజులు వర్ష సూచన
తుఫాను ప్రభావం కారణంగా తెలంగాణలో రాబోయే మూడు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉంది. ఆదివారం సోమవారం రాష్ట్రంలోని దక్షిణ, తూర్పు జిల్లాలలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా, ఇదే రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని దక్షిణ మరియు తూర్పు జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. అలాగే, మంగళవారం కూడా రాష్ట్రంలోని కొన్ని తూర్పు, దక్షిణ జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

