Harish Rao: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీపై భారత రాష్ట్ర సమితి నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలో మద్యం, డబ్బును విచ్చలవిడిగా పంపిణీ చేస్తోందని, అంతేకాకుండా లక్షకు పైగా చీరలు, మిక్సీలను ఓటర్లకు ఎరగా వేస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ విషయాలపై బీఆర్ఎస్ నేతలతో కలిసి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి హరీశ్‌రావు ఫిర్యాదు చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ… తాము ఆరోపణలకు సంబంధించిన వీడియో, ఫోటో ఆధారాలను ఎన్నికల సంఘానికి సమర్పించినట్లు తెలిపారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న కొందరు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్లు చెప్పారు. తమ ఫిర్యాదును సీ-విజిల్ యాప్‌లోనూ నమోదు చేశామని, అయితే కొందరు పోలీసులు మాత్రం ఈ విషయాలను పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్ని అధికార దుర్వినియోగాలు చేసినా, జూబ్లీహిల్స్ ఓటర్లు కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెబుతారని హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర బలగాలను నియమించాలని కోరుతూ, ఆ బూత్‌ల వివరాలను సమర్పించినట్లు తెలిపారు. ముఖ్యంగా, మహిళా ఓటర్ల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని, అలాగే నకిలీ ఓటర్ కార్డులు తయారు చేసిన వీడియోను ఈసీకి సమర్పించామని, దీనిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని సీఈఓ హామీ ఇచ్చారని చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ… గత రెండేళ్లుగా ఆరు గ్యారంటీలు సమీక్షించేందుకు సమయం దొరకని ఆయనకు, ఇప్పుడే రివ్యూ పెట్టడం దేనికని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్‌లో ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి ఈ రోజు ఆరు గ్యారంటీలపై సమీక్ష నిర్వహించడం ఓటర్లను ప్రభావితం చేయడమేనని హరీశ్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్ చేస్తున్న ఈ దివాలాకోరు రాజకీయాలు ప్రజలకు అర్థమయ్యాయని, రేవంత్‌రెడ్డి ఎన్ని డ్రామాలు ఆడినా జూబ్లీహిల్స్ ఓటర్లు ఇప్పటికే తమ నిర్ణయం తీసుకున్నారని హరీశ్‌రావు స్పష్టం చేశారు.

