Cm revanth: నిన్నటి వరకు ఒక లెక్క… రేపటి గ్లోబల్ సమ్మిట్ తర్వాత మరో లెక్క

Cm revanth: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ప్రత్యేక సందేశం అందించారు. ఇదే సమయంలో, సోమవారం నుంచి హైదరాబాద్‌లో జరగనున్న ప్రతిష్ఠాత్మక తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం నగరం మొత్తం అత్యాధునికంగా అలంకరించబడుతోంది. దేశ–విదేశాల నుంచి ప్రతినిధులు తరలివస్తుండటంతో ఫ్యూచర్ సిటీ ప్రాంతం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

 

సీఎం రేవంత్ రెడ్డి తన సందేశాన్ని “జాతి కోసం గొప్ప కలలు కనటానికి ధైర్యం కావాలి… మహా సంకల్పం కావాలి” అంటూ ప్రారంభించారు. గత పాలన వదిలిన శిథిల వ్యవస్థలను సరిచేసి, యువతకు ఉద్యోగాలను, రైతులకు ఆర్థిక భరోసాను, మహిళలకు రక్షణను అందించేందుకు ప్రభుత్వం అహర్నిశలు కృషి చేసిందని పేర్కొన్నారు. నిరుద్యోగులకు భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాల ద్వారా కొత్త ఆశను కల్పించామని గుర్తుచేశారు.

 

సామాజిక న్యాయమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెబుతూ, బలహీన వర్గాల కలలైన కులగణనను చేపట్టడం, మాదిగల వర్గీకరణకు న్యాయం చేయడం వంటి నిర్ణయాలను వివరించారు. ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లు’, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి విద్యా సంస్కరణలు భవిష్యత్తు తరాలకు బలమైన పునాది వేస్తాయని చెప్పారు. అదేవిధంగా, “జయ జయహే తెలంగాణ”ను రాష్ట్ర అధికారిక గీతంగా గుర్తించటం తమ ప్రభుత్వ తత్వాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు.

 

ఇప్పటివరకు అమలు చేసిన సంక్షేమ పథకాల జాబితాను పేర్కొంటే – సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 గ్యాస్ సిలిండర్, సన్నధాన్యాలకు బోనస్, ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేసే ప్రత్యేక పథకాలు – ఇవన్నీ ప్రజా సంక్షేమానికి నిలువెత్తు నిదర్శనాలని అన్నారు.

 

భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తూ, 2047 నాటికి స్వతంత్ర భారతం వందేళ్లను పూర్తిచేసుకునే సమయానికి తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో నిలవాలనే దృక్కోణంతో మార్గదర్శక పత్రాన్ని సిద్ధం చేసినట్లు వెల్లడించారు. “గత పాలకులు ఊహించని విజన్‌తో #TelanganaRising ప్రణాళికలను రూపొందించాం. నిన్నటి వరకు ఒక లెక్క… రేపటి గ్లోబల్ సమ్మిట్ తర్వాత మరో లెక్క మొదలవుతుంది” అని పేర్కొన్నారు.

 

రాష్ట్రంలోని నాలుగు కోట్ల ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాలే తనకు ధైర్యమని, వారి ప్రేమాభిమానాలు తనకు బలం అని చెప్పారు. “తెలంగాణ నాకు తోడుంటే… ఈ గొంతులో ఊపిరి ఉన్నంత వరకు… Telangana Rising కి తిరుగు లేదు” అంటూ సీఎం తన సందేశాన్ని ముగించారు.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *