CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేసి, నాణ్యమైన విద్యుత్‌ను అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంగళవారం సచివాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో విస్తృత సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీలో వ్యయాన్ని తగ్గించడం, డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ను సరఫరా చేయడంపై దృష్టి సారించాలని ఆదేశించారు. ట్రాన్స్‌మిషన్ సమయంలో జరిగే నష్టాలను గణనీయంగా తగ్గించడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. విద్యుత్ కొనుగోళ్ల భారాన్ని తగ్గించుకోవడానికి ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్ (విద్యుత్ మార్పిడి) కోసం ఎంవోయూలు (ఒప్పందాలు) కుదుర్చుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వ పీఎం కుసుమ్ సహా సోలార్ రూఫ్‌టాప్ వంటి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను వేగంగా అమలు చేయాలని, ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టులు 60 రోజుల్లో కార్యాచరణ ప్రారంభించేలా చూడాలని ఆయన గడువు విధించారు.
Also Read: Amaravati: అమరావతిలో రెండో దశ భూసమీకరణకు రంగం సిద్ధం
అంతేకాకుండా, ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్ ప్రాజెక్టులను చేపట్టేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజల్లోనూ విద్యుత్ పొదుపుపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం సూచించారు. మరో ముఖ్యమైన నిర్ణయంగా, ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు ఇస్తున్న ప్రోత్సాహకాలను మరో ఏడాది పాటు కొనసాగించాలని సీఎం ఆదేశించారు. అలాగే, థర్మల్ పవర్ స్టేషన్లలోని బూడిదను వృథా చేయకుండా వివిధ అవసరాలకు వినియోగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో గత ప్రభుత్వ విధానాలు ప్రస్తావనకు వచ్చాయి. అసమర్థ నిర్ణయాలతో గత పాలకులు విద్యుత్ రంగాన్ని అస్తవ్యస్తం చేశారని సీఎం విమర్శించారు. ముఖ్యంగా, పీపీఏల రద్దుతో రూ.9,000 కోట్ల భారాన్ని అప్పటి ప్రభుత్వం ప్రజలపై మోపిందని, కరెంటును వినియోగించకుండానే ప్రజాధనాన్ని కంపెనీలకు చెల్లించిందని ఆయన పేర్కొన్నారు. ఏపీలో విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు కృషి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

