CM Chandrababu: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు శ్రీవారి భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ధ్వజమెత్తారు. తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిలో జరిగిన చోరీని ‘చిన్న దొంగతనం’గా జగన్ అభివర్ణించడంపై ముఖ్యమంత్రి శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
బాబాయి హత్యతో పోలిక: సెటిల్‌మెంట్ రాజకీయం
ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, “సొంత బాబాయి హత్య అంశాన్నే సెటిల్ చేసుకుందామని చూసిన వ్యక్తికి, పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల పరకామణి చోరీ ఘటన పెద్ద విషయం ఎలా అవుతుంది?” అని సూటిగా ప్రశ్నించారు. “దొంగతనం చేసిన వ్యక్తి డబ్బులు తిరిగి కట్టాడు కదా, తప్పేముందని జగన్ అత్యంత అనైతికంగా వాదిస్తున్నారు” అని మండిపడ్డారు.
భక్తులు ఎంతో భక్తితో సమర్పించిన కానుకలు, ముడుపులను కొట్టేసిన దొంగతో సెటిల్మెంట్ ఏమిటని సీఎం నిలదీశారు. రూ.72 వేల చోరీని చిన్నదిగా కొట్టిపారేస్తున్నారని, కానీ చోరీ చేసిన వ్యక్తి రూ.14 కోట్ల విలువైన ఆస్తులు స్వామివారికి రాసిచ్చేందుకు సిద్ధపడ్డాడంటే, అతను ఎంత దోచేసి ఉంటాడో అర్థం చేసుకోవాలని అన్నారు. “దేవుడి హుండీలో చోరీ చిన్న తప్పా? దాన్ని సెటిల్ చేయడం మహాపాపం కాదా?” అని ప్రశ్నించారు. జగన్‌కు దేవుడన్నా, భక్తుల సెంటిమెంట్ అన్నా, ఆలయాల పవిత్రత అన్నా ఏమాత్రం లెక్కలేదని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Goa: గోవాలో ఘోర అగ్ని ప్రమాదం: సిలిండర్ పేలి 23 మంది మృతి
శాంతిభద్రతల ప్రక్షాళన: రౌడీలను ఏరివేస్తాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో తమ ప్రభుత్వం ఎలాంటి మొహమాటాలకు తావు ఇవ్వదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో నేరస్థులను పెంచి పోషించారని, ప్రశాంతంగా ఉండే జిల్లాలను కూడా నేరాలకు అడ్డాలుగా మార్చారని అన్నారు.
నెల్లూరు వంటి చోట్ల లేడీ డాన్లను ఎప్పుడైనా చూశామా? ప్రశాంతతకు మారుపేరైన నెల్లూరు, విజయనగరం లాంటి జిల్లాల్లో గత పాలకుల నిర్వాకం వల్ల నేరస్థులు తయారయ్యారు, అని మండిపడ్డారు. రాష్ట్రంలో అన్నింటినీ ప్రక్షాళన చేస్తామని, నేరస్థులను, రౌడీలను ఏరివేస్తామని సీఎం హెచ్చరించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతిభద్రతల పరిస్థితిలో చాలా మార్పు వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
అమరావతి నిర్మాణం: రైతులు సంతోషంగా ఉన్నారు
రాజధాని అమరావతి రైతుల సమస్యలన్నీ ప్రభుత్వం పరిష్కరిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాజధాని రైతులతో తాను సమావేశమైన తర్వాత మంచి ఫలితాలు వచ్చాయని, రైతులు పూర్తిగా సహకరిస్తున్నారని అన్నారు. రెండో దశ భూ సమీకరణకు కూడా రైతులు సంతోషంగా ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు.
ప్రజలు, రైతులు, ప్రభుత్వం సంతోషంగా ఉండటం చూసి కొందరికి కడుపు మండుతోంది అని పరోక్షంగా విమర్శించారు. భవిష్యత్తులో అమరావతి, తెలంగాణలోని కోకాపేట వంటి ప్రాంతాల కంటే అధికంగా అభివృద్ధి చెందుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

