Ladakh: లడఖ్‌లోని ప్రభుత్వ ఉద్యోగాల్లో లడఖ్ ప్రజలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. లడఖ్ నుంచి స్వతంత్ర ఎంపీ హనీఫా జాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. హనీఫా జాన్ మాట్లాడుతూ, “కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లేహ్ అపెక్స్ బాడీ (LAP),కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ (KDA) ప్రతినిధులతో సమావేశమయ్యారు, ఇందులో రిజర్వేషన్లకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఈ నిర్ణయానికి సంబంధించిన వివరాలను జనవరి 15న జరిగే తదుపరి సమావేశంలో ఖరారు చేయనున్నారు. లేహ్, కార్గిల్‌లలోని ప్రత్యేక లోక్‌సభ స్థానాలపై జనాభా లెక్కల తర్వాత నిర్ణయం తీసుకుంటామని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.
Ladakh: ఆగష్టు 5, 2019 న, జమ్మూ – కాశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజన జరిగింది. వాటిలో ఒకటి లడఖ్. దీని తరువాత, రెండు సంస్థలు – KDA, LAP లడఖ్ ప్రజలకు స్వయంప్రతిపత్తిని కోరాయి. స్థానిక ప్రజలకు ఉద్యోగ రిజర్వేషన్లు అదేవిధంగా లేహ్-కార్గిల్‌కు ఒక పార్లమెంటు స్థానం డిమాండ్ చేస్తూ అనేక ఉద్యమాలు జరిగాయి. లడఖ్‌ను పూర్తి రాష్ట్రంగా మార్చాలని అంతేకాకుండా లడఖ్‌లో రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌ను అమలు చేయాలని డిమాండ్ కూడా వచ్చింది. సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ కూడా ఈ సంస్థల్లో చేరారు. ఎన్నో ఉద్యమాలు కూడా చేశారు. అయితే, తాజాగా జరిగిన సమావేశంలో పూర్తిస్థాయి రాష్ట్రం, ఆరో షెడ్యూల్‌పై చర్చకు సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు.
హిల్ కౌన్సిల్స్‌లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్
మీడియా నివేదికల ప్రకారం, హనీఫా జాన్‌తో పాటు నిత్యానంద్ రాయ్, హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, బీజేపీ మాజీ ఎంపీ తుప్‌స్తాన్ ఛెవాంగ్, హోం మంత్రిత్వ శాఖ అధికారులు, లెహ్ అపెక్స్ బాడీకి చెందిన 8 మంది ప్రతినిధులు, కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్‌కు చెందిన 8 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రిజర్వేషన్-లోక్‌సభ సీటుతో పాటు మరో 4 డిమాండ్‌లను కూడా సమావేశంలో కేంద్రం అంగీకరించింది.
ఇది కూడా చదవండి: Earthquake: తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో స్వల్ప భూప్రకంపనలు
- లడఖ్‌లోని హిల్ కౌన్సిల్స్‌లో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్లు ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.
- లడఖ్ అధికార భాషలుగా ఉర్దూ, భోటీలను ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.
- లడఖ్ సంస్కృతిని కాపాడేందుకు పెండింగ్‌లో ఉన్న 22 చట్టాలను సమీక్షించేందుకు హోం మంత్రిత్వ శాఖ అంగీకరించింది.
- అదే సమయంలో, లడఖ్ ప్రజల భూ సంబంధిత ఆందోళనలను కూడా పరిష్కరిస్తామని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.
లడఖ్‌కు ప్రత్యేక లోక్‌సభ కమిషన్ వస్తుందా లేదా అనేది తదుపరి సమావేశంలో నిర్ణయిస్తారు.
సమావేశం తరువాత, లడఖ్ నుండి మాజీ ఎంపీ తుప్‌స్తాన్ ఛెవాంగ్ మాట్లాడుతూ – లడఖ్ కు ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను పొందుతాము లేదా దానిని జమ్మూ కాశ్మీర్‌లో విలీనం చేస్తారా అనేది తదుపరి సమావేశంలో చర్చిస్తామని చెప్పారు. ప్రస్తుతం జరిగిన సమావేశం పాజిటివ్ గా జరిగింది. మంత్రిత్వ శాఖ అధికారులు మా మాట విన్నారు అని ఆయన తెలిపారు.
లడఖ్ నుండి స్వతంత్ర ఎంపీ హనీఫా జాన్ మాట్లాడుతూ- మేము హోం మంత్రిత్వ శాఖ అధికారులతో చాలా స్పష్టంగా మాట్లాడాము. యువత, ఉపాధికి సంబంధించిన సమస్యలను లేవనెత్తాము. మా ఆందోళనలు వాస్తవమైనవని, వాటిని పరిష్కరిస్తామని ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారని ఆయన వివరించారు.

