Alla Nani

Alla Nani: టీడీపీలో ఆళ్ల నాని చేరికకు మళ్లీ బ్రేక్…!

Alla Nani: ఆళ్ల నాని గోదావరి జిల్లాల్లో పరిచయం అక్కరలేని పేరు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎంగా ప్రాతినిధ్యం వహించినటువంటి కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు ఆళ్ళ నాని… వైఎస్సార్‌ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా జగన్‌కు వీర విధేయుడిగా, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా, ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు వహించిన నాయకుడు ఆళ్ళ నాని. జగన్ క్యాబినెట్‌లో ఆరోగ్య శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు.
అయితే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమితో ఎంతోమంది నాయకుల రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిపోయింది.
దీంతో ఎంతోమంది రాజకీయ నాయకులు తమ భవిష్యత్తును కాపాడుకోవడానికి వైసీపీకి గుడ్ బై చెప్పి కూటమి పార్టీల్లో చేరిపోతున్నారు.

అయితే 2024 ఎన్నికల్లో ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఆళ్ల నాని కూటమి అభ్యర్థి బడేటి చంటి చేతిలో ఓటమి చెందారు దీంతో ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే ఊహించని విధంగా వైసీపీ పదవులకు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి ఆళ్ల నాని సంచలనం సృష్టించారు తనకు ప్రస్తుతం వ్యక్తిగత బాధ్యతలు ఉన్నాయని అందువల్లే కొన్నాళ్ల పాటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నానని రాజీనామా సమయంలో ఆళ్ల నాని తెలిపారు. దీంతో అంతా ఏలూరులో ఆళ్ల నాని హవా ముగిసిందని అనుకున్నారు.

అయితే ఆళ్ల నాని ఇటీవల టీడీపీలో చేరుతున్నారంటూ ఏలూరులో ప్రచారం జరిగింది. ఒక వైపు ఆళ్ల నాని చేరికకు సైతం టీడీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఆళ్ల నాని చేరికను తాము వ్యతిరేకిస్తున్నామంటూ, ఆయన వస్తే సహించేది లేదంటూ ఏలూరులోని కొందరు తెలుగు తమ్ముళ్లు బహిరంగంగానే సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి తమ వ్యతిరేకతను బయటపెట్టారు. ఆళ్ల నాని కంటే ముందే కొందరు నాయకులు తెలుగు దేశ పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని తమ వ్యతిరేకతను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం.

దీంతో మరికాసేపట్లో ఆళ్ల నాని చేరికంటూ వచ్చిన వార్తలకు సడన్ బ్రేక్ పడింది. అయితే కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఆళ్ల నాని చేరిక సిద్ధంగా ఉందంటూ, రేపు పార్టీలో చేరుతున్నారంటూ ప్రచారం సాగింది. అయితే, అప్పటికి ఏలూరులోని తెలుగు తమ్ముళ్లు తమ వ్యతిరేకతను తెలుపుతుండగా, ఎమ్మెల్యే బడేటి చంటితో టీడీపీ అధిష్టానం చర్చించింది. రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆళ్ల నాని టీడీపీలో చేరికకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందని, ఈ విషయాన్ని తెలుగు తమ్ముళ్లకు సానుకూలంగా సమన్వయం చేసే బాధ్యతను సైతం బడేటి చంటి భుజస్కందాలపైన పెట్టింది టీడీపీ అధిష్టానం.

ALSO READ  Rahul Gandhi: మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించిన రాహుల్ గాంధీ

దీంతో ఎమ్మెల్యే బడేటి చంటి స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధిష్టానం ఆదేశాల మేరకు ఆళ్ల నాని చేరికను స్వాగతిస్తున్నామని, పార్టీలో ఎవరు వచ్చిన వారిని కలుపుకుని, ఏలూరులో టీడీపీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతామని బడేటి చంటి తెలిపారు.కార్యకర్తల్లో ఎక్కడైనా మనస్పర్ధలు ఉంటే వాటిని నివృత్తి చేసి, పార్టీ కోసం సమిష్టిగా కృషి చేసేలా చర్యలు చేపడతామని బడేటి చంటి తెలిపారు.

దీంతో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సైతం ఆళ్ల నాని చేరికను తాము స్వాగతిస్తున్నామని మీడియా ముఖంగా తెలియజేశారు. ఇక ఆళ్ల నాని టీడీపీలో చేరిక లాంచనమే అనుకున్నారు అందరూ. డిసెంబర్ 19వ తేదిన సీఎం చంద్రబాబు సమక్షంలో ఆళ్ల నాని టీడీపీలో చేరుతున్నారని, అందుకు ఏలూరు జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు సైతం పాల్గొంటారని ప్రచారం జోరుగా సాగింది. తీరా చూస్తే ఆరోజు కూడా ముచ్చటగా మూడోసారి ఆళ్ల నాని చేరిక ఈరోజు లేదంటూ వాయిదా పడింది. దీంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ఏలూరు నియోజకవర్గ ప్రజలకు సందిగ్ధంలో పడ్డారు.

గతంలో ఆళ్ల నాని హయాంలో టీడీపీ నాయకులపై వేధింపులు జరిగాయని అందుకే తామంతా వ్యతిరేకిస్తున్నామని కొందరు టీడీపీ నాయకులు చెప్తుంటే, మరోవైపు ఆళ్ల నాని టీడీపీలో చేరితే తమ రాజకీయ ఎదుగుదలకు అడ్డుగా మారతారు అంటూ మరికొందరు నాయకులు అయితే భావిస్తున్నట్టు తెలుస్తుంది అంతే కాకుండా గతంలో ఆళ్ల నాని డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు అతని చుట్టూ ఉన్న కొందరు నాయకులు, ఎన్నికల ముందు టీడీపీలో చేరారు ఇప్పుడు నాని కూడా టీడీపీలోకి వస్తే మళ్ళీ తమ పరిస్థితి ఏంటి అని వారంతా ఆందోళన చెందుతున్నారు.

అయితే అలాంటి సమస్యలు ఏమి లేవని, కేవలం సీఎం చంద్రబాబు బీజీ షెడ్యూల్ వల్ల సమయం దొరక్క, మరోవైపు ముహూర్త బలం కోసం ఆళ్ల నాని వేచి చూస్తున్నారంటూ ఆళ్ల నాని వర్గం చెప్తోంది. దీంతో అసలు ఆళ్ల నాని చేరికకు టీడీపీ అధిష్టానం ఎప్పుడు క్లియరెన్స్ ఇస్తుంది? అసలు ఆళ్ల నాని చేరిక తర్వాత ఏలూరులో తెలుగు తమ్ముళ్లతో కలిసి ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది వేచి చూడాల్సిన అంశం….

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *