America: అమెరికాలో కాలిఫోర్నియాలో బర్డ్ ఫ్లూ (H5N1) కలకలం రేపుతోంది. ఈ వైరస్ ప్రభావంతో 34 మంది బాధితులు నమోదయ్యారు. దక్షిణ కాలిఫోర్నియాలోని ఓ డెయిరీ ఫాంలో ఈ వైరస్ను గుర్తించడంతో రాష్ట్ర గవర్నర్ గవిన్ న్యూసమ్ అత్యవసర పరిస్థితి ప్రకటించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారంతా ఆ డెయిరీ ఫాంలో పనిచేసినవారే లేదా ఆ ప్రాంతానికి దగ్గర్లో ఉన్నవారే అని స్పష్టం చేశారు. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఈ వైరస్ సంక్రమించిన ఆధారాలు ఇప్పటివరకు లభించలేదు. ఈ కారణంగా సాధారణ ప్రజలకు ముప్పు లేదని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) వెల్లడించింది.
ప్రభుత్వం పశువుల ఆరోగ్యంపై పర్యవేక్షణను కఠినతరం చేస్తోంది. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి డెయిరీ ఫామ్ ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రం చేసి, వైరస్ వ్యాప్తిని నిరోధించే చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు ఆరోగ్య నిపుణుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితిని పూర్తిగా నియంత్రించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

