Murder: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ఒంటరిగా ఉన్న విద్యార్థినిని ఆమె గదిలోకి చొరబడిన యువకుడు హత్య చేసినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. అన్నమయ్య జిల్లా, రామసముద్రం మండలం, బిక్కిమానిపల్లి గ్రామానికి చెందిన దేవిశ్రీ (21), బెంగళూరులో ఉంటూ ఓ ప్రైవేట్ కాలేజీలో బీబీఎం చదువుతున్నారు. ఆమె తన రూమ్‌లో ఉన్న సమయంలో ప్రేమ్ వర్ధన్ అనే యువకుడు దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. ఈ హత్యకు గల కారణాలు ప్రేమ వ్యవహారమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Pradeep Ranganathan: లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ.. మరో 100కోట్ల సినిమా అవుతుందా..?
హత్య చేసిన నిందితుడు ప్రేమ్ వర్ధన్, చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, పెద్దకొండామారి గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బెంగళూరులోని తమ్మినహళ్లి పోలీసులు, నిందితుడు ప్రేమ్ వర్ధన్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చదువుల కోసం బెంగళూరుకు వెళ్లిన యువతి ఇలా హత్యకు గురికావడం తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపింది.
పరారీలో ఉన్న ప్రేమ్ వర్ధన్ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. చదువు పూర్తి చేసుకుని పట్టాతో ఇంటికి వస్తుందనుకున్న కుమార్తె విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి రోదనలు ఇరుగుపొరుగు వారి హృదయాలను కలచివేస్తున్నాయి.

