BCCI: దేశవాళీ క్రికెట్‌లో పలు మార్పులు చేస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. పెనాల్టీ పరుగులకు సంబంధించి నిబంధనల్లో మార్పులు చేస్తూ అందుకోసం సవరణలు కూడా చేసింది. ఈ మేరకు రాష్ట్ర క్రికెట్ సంఘాలకు నోట్ పంపినట్లు సమాచారం. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఫీల్డర్ వస్తువులకు బంతి ఉద్దేశపూర్వకంగా తాకలేదని అంపైర్లు భావిస్తే.. దానిని సరైన బంతిగానే పరిగణించేలా బీసీసీఐ సవరణలు చేసినట్లు తెలుస్తోంది.
BCCI: ఇకనుంచి జరగబోయే దేశవాళీ క్రికెట్‌లో కొత్తగా నిబంధనలు అమలు కానున్నాయి. ఫీల్డింగ్ చేస్తున్న ఆటగాడి నుంచి పొరపాటున బంతి చేజారినప్పుడు అదే సమయంలో ఏదైనా క్లాత్, పరికరం, ఇతర వస్తువులపై పడినా సరే దానిని ఇల్లీగల్ బంతిగా పరిగణించరు. వికెట్ కీపింగ్ గ్లోవ్‌లు, ఫీల్డర్ క్యాప్‌లు కింద పడినప్పుడు బంతి తగిలినా పెనాల్టీ పరుగులు ఇవ్వకుండా నిబంధనలు సవరించారు. బంతి గేమ్ లోనే ఉండి అదే సమయంలో వికెట్ పడితే సరైందిగా భావించేలా సవరణలు చేసింది బీసీసీఐ. ఎవరైనా బ్యాటర్ బంతిని కొట్టినప్పుడు.. దానిని ఆపే క్రమంలో ఫీల్డింగ్‌కు సంబంధించిన పరికరాలు, వస్తువులను తాకినప్పుడు బ్యాటింగ్ జట్టుకు ‘పెనాల్టీ’ రూపంలో అదనంగా పరుగులు ఇచ్చేవారు. ఇకనుంచి అనుకోకుండా ఇలా జరిగినా.. దానిని మోసపూరిత ఫీల్డింగ్‌గా పరిగణించరు. అప్పుడు ప్రత్యర్థికి ఎలాంటి పెనాల్టీ పరుగులు ఇవ్వరు. ఈమేరకు బీసీసీఐ ప్రకటన చేసింది.
BCCI: గతంలో నిబంధనల ప్రకారం ఫీల్డర్ బంతిని పట్టుకొనే క్రమంలో కింద పడి ఉన్న వస్తువుకు తాకినప్పుడు అప్పటితో ఆ బంతి డెడ్ అవుతుంది. పెనాల్టీ పరుగులు ప్రత్యర్థి జట్టుకు ఇవ్వబడతాయి. ఒకవేళ అప్పటికే బ్యాటర్లు కొన్ని పరుగులు తీసి ఉంటే.. అవి కూడా అదనంగా కలుస్తాయి. ఎందుకు పెనాల్టీగా ఇచ్చామనేది ఇరు జట్ల కెప్టెన్లకు అంపైర్లు తెలపాల్సి ఉంటుంది. ఆ ఓవర్‌లో ఆ బంతిని కౌంట్ చేయరు. ఇప్పుడు ఈ రూల్స్‌కు బీసీసీఐ సవరణలు చేసింది. ఉద్దేశపూర్వకంగా బంతి సదరు వస్తువులను తాకలేదని అంపైర్లు అనుకుంటే దానిని మోసపూరితంగా భావించక్కర్లేదు. సరైన బంతిగానే పరిగణించి అప్పుడు ఏ ఫలితం వస్తుందో దానినే అమలు చేయాలంటూ బిసిసిఐ కొత్త నిబంధనలను ప్రవేశ పెట్టింది.